పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu News)... లఖింపుర్ ఖేరిలో మరణించిన జర్నలిస్ట్ రామన్ కశ్యప్ నివాసంలో నిరాహార దీక్షను శుక్రవారం చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడిని అరెస్ట్ చేసేంత వరకు తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాని అన్నారు. కశ్యప్ రైతుల నిరసనను కవర్ చేస్తున్నప్పుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో కొంతమంది రైతులతో సహా మొత్తంగా 8 మంది మరణించారు. లఖింపుర్ ఖేరీలో జరిగిన హింసాత్మక ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు సిద్ధూ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే నిరాహార దీక్షకు దిగారు. దీనితో పాటు మౌనవ్రతం కూడా చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం లోగా మంత్రి కుమారుడ్ని అరెస్ట్ చేయాలని అధికారులకు అల్టీమేటం జారీ చేశారు. లేని పక్షంలో నిరాహార దీక్ష చేస్తామని ముందే చెప్పారు.
పరామర్శించిన హర్సిమ్రత్ కౌర్ బాదల్..
శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హింసాత్మక ఘటనలో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనితో పాటు మంత్రిని కూడా బర్తరఫ్ చేయాలని కోరారు.
18న దేశ వ్యాప్తంగా రైల్‌రోకో..
లఖింపుర్ ఖేరి ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను (Ajay Mishra Bjp) తొలగించడం, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయడం వంటి డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే.. ఈనెల 18న దేశ వ్యాప్తంగా రైల్‌రోకో చేపడుతామని సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరించింది. ఈమేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 12న రైతు యోధుల దినోత్సవం(వహీద్ కిసాన్ దివాస్) నిర్వహిస్తామని వెల్లడించింది. హింసాత్మక ఘటనల్లో అమరులైన రైతుల సంస్మరణ సభను అదే రోజు తికోనియాలో ఉంటుందని తెలిపింది. రైతు సంఘాలు, అన్నదాతలు ఈరోజున సంస్మరణ సభలు నిర్వహించాలని.. అన్ని మతాల వారు ప్రార్థనలు నిర్వహించాలని అమరులకు శ్రద్ధాంజలి ఘటించాలని విజ్ఞప్తి చేసింది. సాయంత్రం వేళ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాలని కోరింది.
ఇదీ చూడండి: ప్రధాన ఆర్థిక సలహాదారుగా వైదొలిగిన కేవీ సుబ్రమణియన్