దిల్లీ పేలుడు ఘటన విచారణలో భాగంగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఎస్‌జీ) తనిఖీలు చేపట్టింది. పేలుడు జరిగిన స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఘటనాస్థలంలో ఎరుపు రంగు వస్త్రంతో కట్టిన మూటను గుర్తించారు. ఆ మూటను ఫోరెన్సిక్ కార్యాలయానికి తరలించారు.
మరోవైపు ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు పై పలువురు క్యాబ్ డ్రైవర్లను దిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించారు. ఉదయం నుంచి చాలా మంది క్యాబ్ డ్రైవర్లను విచారించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు.
సీసీ కెమెరాల డేటా సేకరణ
పేలుడు జరగక ముందు రెండు గంటలు, జరిగిన తర్వాతి గంటకు సంబంధించిన సీసీ కెమెరాల డేటాను సేకరించారు పోలీసులు. ఆ సమయంలో రాకపోకలు సాగించిన క్యాబ్ డ్రైవర్లను ప్రశ్నించినట్లు తెలిపారు. పేలుడు సమయంలో ఇద్దరు అనుమానాస్పదంగా క్యాబ్ నుంచి దిగడం సీసీ కెమెరాలో గమనించామన్నారు. ఉబర్, ఓలా యాజమాన్యాల నుంచి సహకారం కోరారు.
మరోవైపు.. పేలుడుతో, ఎర్రకోట ఘటనలకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీస్, ఫోరెన్సిక్ బృందం ఎర్రకోటకు వెళ్లి.. అక్కడి పరిసరాలను తనిఖీ చేశారు.
ఇదీ చదవండి : దిల్లీ పేలుడు కేసు ఎన్ఐఏకు అప్పగింత!