Nails in head: రాజస్థాన్ జోధ్‌పుర్‌లోని ఎండీఎం ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసి ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. అతడి తలలోకి దిగిన 8 మేకులను బయటకు తీశారు. ఒక మేకు మెదడు లోపలకి చొచ్చుకెళ్లినా.. అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఎలాంటి సమస్యా రాకుండా తొలగించారు. 10 రోజులు అబ్సర్వేషన్లో ఉంచిన అనంతరం డిశ్ఛార్జ్ చేశారు. ఇప్పుడు అతడు సాధారణ వ్యక్తిలా పూర్వస్థితికి వచ్చాడని వెల్లడించారు.
Jodhpur news
ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, ఆచార్య డా.శరద్ తన్వి నేతృత్వంలోని వైద్య నిపుణల బృందం ఈ ఆపరేషన్ చేసింది. డిసెంబర్ 18న 26 ఏళ్ల యువకుడిని ఆస్పత్రికి తీసుకొచ్చారని, పని చేస్తుండగా డ్రిల్ మెషిన్ నుంచి 8 మేకులు అతని తలలోకి దిగాయని చెప్పారు. ఓ మేకు అతడి మెదడులోకి లోతుగా దిగినట్లు ఎక్స్‌రే, సీటీ స్కాన్‌లో గుర్తించి అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేసినట్లు చెప్పారు. ఆపరేషన్ కొంచెం అటు ఇటు అయినా యువకుడు జ్ఞాపకశక్తి కోల్పోవడమో, పక్షవాతం వచ్చే ప్రమాదమో ఉండేదన్నారు.
" ఇది అత్యంత సున్నితమైన ఆపరేషన్. ఏ మాత్రం తేడా జరిగినా యువకుడు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే రెండు దశల్లో ఈ సర్జరీ పూర్తి చేశాం. తొలి రోజు 7 మేకులను తల నుంచి బయటకు తీశాం. కుడివైపు మెదడు లోపలికి చొచ్చుకెళ్లిన మరో మేకును ఆ మరునాడు వెలికితీశాం. ఎంతో రిస్క్‌తో కూడుకున్న ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాం"
-ఎండీఎం ఆస్పత్రి వైద్యులు
యువకుడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని, ఎలాంటి సమస్యా లేదని వైద్యులు చెప్పారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 1.80 లక్షల కేసులు.. భారీగా తగ్గిన మరణాలు