Woman Makes Baskets From Waste Papers : మనం రోజూ న్యూస్ పేపర్ చదవగానే పక్కన పడేస్తాం. లేదంటే కిరాణా షాపులకు అమ్మేస్తాం. కొందరు చిన్న పిల్లలు అయితే పడవలు చేసుకోవడానికో లేదా ఆడుకోవడానికో వినియోగిస్తారు. అయితే మహారాష్ట్రకు చెందిన సాధన ఫద్కర్ అనే మహిళ మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించింది. పాత న్యూస్ పేపర్లను పడేయకుండా వాటితో వివిధ రకాల అందమైన బుట్టలను తయారు చేస్తోంది.
నాగ్‌పుర్‌కు చెందిన సాధన ఫద్కర్.. న్యూస్ పేపర్స్‌తో బుట్టలను చేయటం 2014లో ప్రారంభించింది. వీటిని చేయడానికి పాత న్యూస్ పేపర్స్‌ను మాత్రమే ఉపయోగిస్తోంది. రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ అనే ట్రిపుల్ ఆర్ సూత్రంతో పాత న్యూస్ పేపర్స్‌తో అద్భుతాలు చేస్తోంది సాధన. బుట్టలే కాకుండా, హ్యాండ్‌బ్యాగ్‌లు, కుండీలు, పేపర్ బ్యాగ్‌లు, టేబుల్ ల్యాంప్‌లు వంటి అనేక విభిన్న వస్తువులను తయారు చేస్తోంది.
"నేను ఏదైనా వినూత్నంగా చేయాలని అనుకున్నాను. రష్యాలో న్యూస్ పేపర్స్‌తో బుట్టలను తయారు చేయటం చూశాను. అలా చేయటం నాకు స్ఫూర్తినిచ్చింది. అప్పటి నుంచి న్యూస్ పేపర్స్‌తో బుట్టలను చేయటం ప్రారంభించాను. వాటిని ఎలా చేయాలో సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని నా కళను మెరుగుపరుచుకున్నాను. బుట్టలను చేయడానికి ఫెవికాల్, పాత న్యూస్ పేపర్స్, పెద్ద సూదులను మాత్రమే ఉపయోగిస్తాను. చిన్న పిల్లలకు ఇప్పటి నుంచే రీయూజ్, రీసైక్లింగ్ వంటి వాటిపై అవగాహన పెంచాలి. తక్కువ ఖర్చుతో సృజనాత్మకంగా ఏమైనా చేసేలా పిల్లలను ప్రోత్సహించాలి. పిల్లలు ఏమైనా వినూత్నంగా చేసినప్పుడు కచ్చితంగా తల్లిదండ్రులు సహయం చేయాలి"
- సాధన ఫద్కర్
సాధన ఫద్కర్ కొంతమంది మహిళలకు న్యూస్ పేపర్స్‌తో వివిధ రకాల వస్తువులను తయారు చేయటంలో శిక్షణ ఇవ్వాలని అనుకుంటోంది. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు తన వంతు చేయూతను ఇవ్వాలని అనుకున్నట్లు తెలిపింది.
"ఆర్థికంగా వెనుకబడిన మహిళల్లో కొంతమందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చేద్దామనుకుంటున్నారు. వారికి పాత న్యూస్ పేపర్స్‌తో బుట్టలను, వివిధ రకాల వస్తువులను తయారు చేయటంలో శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను. తక్కువ ఖర్చుతో వీటిని తయారు చేయటంలో మంచి నైపుణ్యాలను పెంపొందించాలనేది నా ఆలోచన"
- సాధన ఫద్కర్
న్యూస్ పేపర్స్‌తో చేసిన వస్తువులు చూడటానికి దృఢంగా కనిపించవని సాధన చెబుతోంది. అవి ఎక్కువకాలం మంచిగా ఉండటానికి నీళ్లకు దూరంగా, తడవకుండా చూసుకోమని సాధన సూచిస్తోంది.