Nagaland Under AFSPA: నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై తాజాగా చోటుచేసుకున్న కాల్పులు అక్కడ శాంతిచర్చలకు తీవ్ర విఘాతం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగుబాటుదారులకు నాగాల్లో మళ్లీ మద్దతు పెరిగేందుకూ అవి కారణమయ్యే ముప్పు గోచరిస్తోంది. వాస్తవానికి నాగా ప్రజల నుంచి భద్రతాదళాలకు ముందునుంచీ మద్దతు తక్కువే! గత నెల 13న మణిపుర్‌లోని చురాచంద్‌పుర్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ జవాను ఖత్నాయ్ కొన్యాక్ తిరుగుబాటుదారుల చేతుల్లో మృత్యువాతపడ్డాక పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. కొన్యాక్ అంత్యక్రియల సమయంలో ఆయన తండ్రి తమ గిరిజన జాతి ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు.
ఒప్పందం అమల్లో ఉన్నా..
Naga Peace Accord: భారత్‌కు, భద్రతాబలగాలకు మద్దతివ్వాలని గద్గద స్వరంతో పిలుపునిచ్చారు. అప్పటి నుంచి బలగాల విషయంలో నాగాల ఆలోచనా ధోరణి కొంత మెరుగుపడింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా కాల్పులు బలగాలకు మద్దతిచ్చే అంశంపై నాగాలను పునరాలోచనలో పడేలా చేస్తాయనడంలో సందేహం లేదు. మరోవైపు- బలగాలు, వివిధ తిరుగుబాటు ముఠాల మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. దాన్ని ఉల్లంఘిస్తూ భద్రతాదళాలు కాల్పులకు పాల్పడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.
'నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిజం (ఎన్‌ఎస్‌సీఎన్)'లోని ఇసాక్ ముయివా (ఐఎం) చీలిక వర్గంతో ప్రభుత్వం దీర్ఘకాలంగా జరుపుతున్న శాంతిచర్చలకూ అది విఘాతం కలిగించే అవకాశముంది. నాగాల్లోని వివిధ గిరిజన తెగల మధ్య కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. తాజా కాల్పుల నేపథ్యంలో అవి మళ్లీ ఏకతాటిపైకి వచ్చి.. శాంతిచర్చల్లో భారత బృందాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాలను కొట్టిపారేయలేం.
సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంపైనా..
Nagaland Under AFSPA: ఈశాన్య భారతంతో పాటు కశ్మీర్‌లో సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరించుకోవాలంటూ ఏళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. మోన్ కాల్పుల ఘటనతో అవి మరింత జోరందుకోవడం ఖాయం. నాగా యువత మున్ముందు మరింత ఎక్కువ సంఖ్యలో తిరుగుబాటు ముఠాల్లో చేరేందుకూ తాజా పరిణామాలు ఆస్కారం కల్పిస్తాయన్న విశ్లేషణలు వస్తున్నాయి.
మణిపుర్‌లో కనీసం 11 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో నాగాలు ఉన్నారు. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. తాజా కాల్పుల ప్రభావం వాటిపైనా పడే అవకాశముంది.