తమిళనాడు.. ఒకప్పుడు ప్రతీకార రాజకీయాలకు పెట్టింది పేరు. దిగ్గజ నేతలు కె. కామరాజ్(కాంగ్రెస్), సీఎన్ అన్నాదురై(డీఎంకే), ఎంజీఆర్(అన్నాడీఎంకే)కు అక్కడ విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉండేది. వారి తర్వాత అంతే ప్రజాదరణ పొందారు జయలలిత, కరుణానిధి.
తమిళనాట దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్యే పోటీ. 1967లో కాంగ్రెస్ అధికారం కోల్పోయినప్పటి నుంచి అధికారం ఈ ద్రవిడ పార్టీల మధ్యే చేతులు మారుతూ వస్తోంది. ఆ తర్వాత ఎప్పుడూ జాతీయ పార్టీలు కాంగ్రెస్, భాజపాకు అవకాశమే ఇవ్వలేదు ప్రాంతీయ పార్టీలైన అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే), ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే). లోక్‌సభ, అసెంబ్లీ ఏ ఎన్నికలైనా.. ప్రతీకారాలు, వ్యూహప్రతివ్యూహాలు తప్ప రాజకీయ శూన్యత గురించి చర్చే లేదు.
అయితే రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన జయలలిత(అన్నాడీఎంకే), కరుణానిధి మరణం తర్వాత.. పరిస్థితులు వేరు. వీరిద్దరి అస్తమయం తర్వాత ఆ స్థాయి నాయకులెవరన్నది ప్రశ్నగానే మిగిలింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ శూన్యత అంశం తెరపైకి వచ్చింది.
రజనీతో మొదలు..
రజనీకాంత్.. తొలుత రాష్ట్రంలో రాజకీయ శూన్యతను ప్రశ్నించారు. ఆయన రాజకీయాల్లోకి రానని చెప్పే ముందు వరకు ఈ అంశంపై తన గళాన్ని వినిపించారు. ఆ తర్వాత.. మక్కల్ నీది మయ్యమ్ అధినేత, సినీనటుడు కమల్ హాసన్ తనకు తాను ఎంజీఆర్ వారసుడిగా చెప్పుకుంటున్నారు.
ఇదే సమయంలో తమిళుల ఆకాంక్షల నెరవేర్చేది తామేనని భాజపా నమ్ముతోంది. రాజకీయ లోటును పూడ్చేందుకు.. ఇదే సరైన సమయమని, తమ పార్టీనే తగినదని చెప్పుకుంటోంది.
మరోవైపు.. జయలలిత, కరుణానిధి లేకుండా జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ శూన్యత అంశమేమీ పెద్దగా కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదీ చూడండి: తమిళులపై 'ఎమ్జీఆర్' అస్త్రం ప్రభావమెంత?
కొనసాగిన ఆధిపత్యం..
అయితే.. అక్కడ ద్రవిడ పార్టీలు ఇంకా ఉన్నాయనే విషయం మర్చిపోవద్దు. ఆ ఇద్దరు దిగ్గజ నేతలు లేకున్నా.. ఈ పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోలేదు. అన్నాడీఎంకే ఇప్పటికీ రాష్ట్రాన్ని పాలిస్తూనే ఉంది. డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా గణనీయ ప్రభావం చూపించింది. వాస్తవం చెప్పాలంటే.. రెండు పార్టీలు ఆధిపత్యం చెలాయించాయి. జాతీయ పార్టీలకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.
2019 లోక్‌సభ ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. భాజపాతో జట్టుకట్టినందున 'అన్నాడీఎంకే'కు ఘోర పరాభవం ఎదురైంది. మోదీ మ్యాజిక్ అక్కడ పనిచేయలేదు. డీఎంకేను గెలిపించారు తమిళులు.
ఈ క్రమంలో డీఎంకే చీఫ్ స్టాలిన్, జయలలిత లేని 'అన్నాడీఎంకే' బాధ్యతలు తీసుకున్న పళనిస్వామి పార్టీలకు అతీతంగా ఎదుగుతున్నారు. వ్యక్తిగతంగా తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు.
స్టాలిన్‌కు పెరుగుతున్న ఆదరణ..
2016 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేను ముందుండి నడిపించిన ఎంకే స్టాలిన్.. త్రుటిలో అధికారాన్ని కోల్పోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీని విజయపథంలో నడిపారు. ఆ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే స్టాలిన్ భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక ప్రచారం స్టాలిన్‌కు కలిసొచ్చింది. ఆయన నేతృత్వంలోని కూటమి 39 స్థానాలకు గాను 38 చోట్ల గెలిచింది. అప్పుడే స్టాలిన్.. కరుణానిధికి తగ్గ వారసుడిగా నిరూపించుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావించారు.
ఆది నుంచే..
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో స్టాలిన్‌దే కీలక పాత్ర. డీఎంకే సారథిగా బాధ్యతలు చేపట్టకముందే, కరుణానిధి ఉన్నప్పుడే.. ఆయన తన సోదరుడు ఎంకే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన రాజకీయ పునరాగమనంపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. తన సోదరి కనిమొళిని కూడా పెద్దగా ప్రభావితం కానివ్వలేదు.
ఇప్పుడు.. అన్నాడీఎంకేపై ప్రభుత్వ వ్యతిరేకత సహా ఆ పార్టీ భాజపాతో పొత్తును తనకు అనుకూలంగా మల్చుకోవడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు స్టాలిన్. ఇదే విధంగా ముందుకెళ్తే.. ఆయన విజయానికి ఎంతో దూరంలో లేరని చెబుతున్నారు విశ్లేషకులు.
ఇదీ చూడండి: స్టాలిన్‌ను దాటి అన్నాడీఎంకే హ్యాట్రిక్ కొట్టేనా?
పళనిస్వామి నిరూపించుకున్నారా..?
జయలలిత మరణంతో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అప్పటి సీఎం ఓ పన్నీర్ సెల్వం మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే అది కొంతకాలమే. జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ సవాల్ విసిరినప్పటికీ.. పళనిస్వామి వెనక్కితగ్గలేదు. పన్నీర్ సెల్వంకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి.. పాలన సాగించారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే గెలిచినా.. అసెంబ్లీ ఉపఎన్నికల్లో 9 స్థానాల్లో గెలిపించి ప్రమాదంలో ఉన్న ప్రభుత్వాన్ని గట్టెక్కించారు.
రైతు నేత..
ముఖ్యమంత్రిగా ఉన్న పళనిస్వామి.. క్రమక్రమంగా తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. పార్టీలో, తమిళుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 'అన్నాడీఎంకే'కు కంచు కోట, పశ్చిమ తమిళనాడులోని కొంగు ప్రాంతం నుంచే వచ్చిన పళనిస్వామికి అక్కడి గౌండర్ వర్గంలో విశేష ఆదరణ ఉంది.
పళనిస్వామి కూడా ఓ మంచి నాయకుడిగా ఉద్భవించారని పార్టీలో కొందరు విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లే సమయంలో.. పార్టీ కార్యకర్తలు పళనిస్వామికి పాదాభివందనం చేయడం చాలా సార్లు కనిపించింది. ఇలాంటి ఆదరణ ఒకప్పుడు జయలలితకు ఉండేదని చెప్పుకుంటున్నారు.
శశికళ, దినకరన్‌తో కలుస్తారా?
జయ మరణం తర్వాత.. శశికళ, టీటీవీ దినకరన్‌ను పళనిస్వామి పార్టీకి దూరంగా ఉంచినప్పటికీ ఈ వ్యవహారం ఎంతో దూరం వెళ్లలేదు. వారితో రాజీ కుదుర్చుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇందులో.. భాజపా ప్రధాన పాత్ర పోషించనుందని తెలుస్తోంది.
2014తో(44.3 శాతం) పోలిస్తే.. 2019లో(31.26 శాతం) అన్నాడీఎంకే ఓట్ల శాతం పడిపోయిందనేది నిజం. అయితే.. రాజకీయ పండితుల విశ్లేషణలు తలకిందులు చేస్తూ డీఎంకే చేతుల్లోకి అధికారాన్ని చేజారనివ్వలేదు. జయలలిత లేకపోయినప్పటికీ.. పార్టీ ఇంకా బలంగానే కనిపిస్తోంది.
దిగ్గజాలు జయలలిత, కరుణానిధి చాటున తమ ప్రభావం చూపించిన పళనిస్వామి, స్టాలిన్‌కు ఇవి ప్రతిష్టాత్మక ఎన్నికలు. మరి తమిళుల హృదయాల్లో నిలిచేదెవరు? ప్రజలు.. ఎవరిపై విశ్వాసం ఉంచుతారనేది ఆసక్తికర అంశం.
ఈ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో రాజకీయ శూన్యత అనవసర అంశమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అది మచ్చుకైనా లేదని.. అయితే రానున్న ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను తలపిస్తాయని భావిస్తున్నారు.
(ఎంసీ రాజన్, ఈటీవీ భారత్)
ఇదీ చూడండి: అన్నాడీఎంకే 'మౌనం'- ఏకాకిగా విజయకాంత్!