మతసామరస్యానికి మారుపేరు భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడి ప్రత్యేకత. వందల ఏళ్లుగా చెక్క చెదరని సంస్కృతి మనది అని చెప్పటానికి ఎన్నో ఉదంతాలు ఉదాహరణలుగా నిలిచాయి. కర్ణాటకలోని రామనగర జిల్లాలో ఓ ముస్లిం.. హిందూ ఆలయాన్ని నిర్మించటం అలాంటి వాటిలో ఒకటి. చెన్నపట్న తాలూకాలో సంతె మొగెనహల్లి గ్రామంలో ఉందీ ఆలయం. సయ్యద్ సదత్ అనే ఓ ముస్లిం వ్యక్తి తన సొంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించి.. మత సామరస్యాన్ని చాటి చెప్పారు.
చెన్నపట్న తాలూకాలోనే పుట్టి పెరిగిన సయ్యద్ సదత్.. అన్ని మతాల వాళ్లతో స్నేహ పూర్వకంగా ఉండాలని చెబుతుంటారు. అలా చెప్పటమే కాదు.. సంతె మొగెనహల్లి గ్రామంలో వీరభద్రస్వామి ఆలయం నిర్మించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. గుడిలోనే మసీదు కూడా ఉండటం ఈ నిర్మాణంలోని ప్రత్యేకత. అలా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది ఈ ఆలయం.
2010లో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించారు సయ్యద్. పేర్లు వేరే అయినా దేవుడు ఒకటేనన్న సందేశమిస్తూ అందరిలోనూ అదే భావన కలిగించే ప్రయత్నం చేశారు. ఈ కరోనా కష్టకాలంలో ఆకలితో ఉన్న వారికి ఆహారమూ అందిస్తున్నారు సయ్యద్.
కీర్తిశేషులు శ్రీ శివకుమార్ స్వామీజీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు. సయ్యద్‌కు హిందూ ఆచారాలు, పండుగలపై అపారమైన గౌరవం. అందుకే మతసామరస్యాన్ని పెంచేందుకు తన వంతు కృషి చేస్తున్నారు.
చెన్నపట్న తాలూకాలోనే మంగళవార పేటెలోనూ బసవేశ్వర ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారు సయ్యద్. ఈ గ్రామంలోని హిందువులు, ముస్లింలు ఒకరి పండుగల్లో ఒకరు పాలు పంచుకునేంత దగ్గరైపోయారు. ముస్లింలు నిర్వహించే మత కార్యక్రమాలకు హిందువులూ హాజరవుతున్నారు.
ప్రస్తుతానికి ఈ రెండు వర్గాల ప్రజలు ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. పగలు, ప్రతీకారాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో సయ్యద్ సదత్ లాంటి వ్యక్తులు పరమత సహనాన్ని నేర్పటం ఎంతో గొప్ప విషయం. అన్ని మతాల వాళ్లు కలిసిమెలిసి ఉండాలన్న ఆయన ఆశయాన్ని అభినందించకుండా ఉండలేం.
ఇదీ చూడండి: సర్వ మతాల సారాన్ని చెప్పే.. మాముని ఖాతూన్