ముంబయి ఘట్కోపర్‌లోని ఓ ఆస్పత్రిలో కంటి దగ్గర ఎలుక కరచిన 24 ఏళ్ల రోగి మరణించినట్లు మున్సిపల్ అధికారులు(బీఎంసీ) తెలిపారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆ రోగి ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రిలో చేరిన మొదటి రోజు నుంచే విషమంగా ఉందని చెప్పారు. ఎలుక చేసిన గాయాలు రోగి కంటిపై ఎటువంటి ప్రభావం చూపలేదని వివరించారు.
మంగళవారమే రోగి బంధువులు.. కంటి దగ్గర ఎలుక కరచిందని ఆరోపించారు. ఆ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం సైతం ధ్రువీకరించింది. అయితే.. దానివల్ల రోగి కంటికి ప్రమాదం లేదని వెల్లడించింది. ఈ వ్యవహారంపై ముంబయి మేయర్ దర్యాప్తునకు ఆదేశించారు.
ఈ ఘటనపై ఈశాన్య ముంబయి నియోజకవర్గ భాజపా ఎంపీ మనోజ్ కోటక్ బీఎంసీపై మండిపడ్డారు.
"బీఎంసీ ఆసియాలోనే అతిపెద్ద మున్సిపల్ సంస్థగా చెప్తున్నారు. కానీ ఎలుకల నుంచి రోగులను రక్షించేందుకు సరైన చర్యలు లేవు. కొందరి నిర్లక్ష్యం వల్ల రోగి కుటుంబం తీవ్ర వేదనలో ఉంది"
-మనోజ్ కోటక్, భాజపా ఎంపీ
ఇవీ చదవండి: ఐసీయూలో రోగిని కరిచిన ఎలుక- మేయర్ సీరియస్