కరోనా కల్లోలం అనేకమంది జీవితాల్లో అంతులేని విషాదాన్ని నింపుతోంది. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. మానవాళిపై పెను తుపానులా విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి దాటికి వైద్యులు సైతం తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ముంబయిలో స్వెరి టీబీ ఆస్పత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మనీషా జాదవ్ (51) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. తన మరణానికి ముందు ఫేస్‌బుక్‌లో ఆమె పోస్ట్ చేసిన సందేశం అందరి హృదయాలనూ కలచివేస్తోంది.
క్షయవ్యాధి నిపుణురాలిగా ఉన్న మనీషా ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. అయితే, తన మరణాన్ని ముందే ఊహించిన మనీషా జాదవ్ ఇకపై తాను బతికి ఉండకపోవచ్చన్న సంకేతాలు ఇచ్చేలా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. 'ఇదే చివరి గుడ్ మార్నింగ్ కావొచ్చు. ఈ వేదికపై నేను మిమ్మల్ని కలవకపోవచ్చు. అందరూ జాగ్రత్త. మరణం శరీరానికే. ఆత్మకు కాదు. ఆత్మకు చావులేదు' అని మనీషా ఆదివారం ఉదయం పోస్ట్ చేసిన సందేశం వైరల్‌గా మారింది. ఈ సందేశం పోస్ట్‌చేసిన 36గంటల వ్యవధిలోనే ఆమె ప్రాణాలు విడిచారు.
మరోవైపు, దేశంలోని అనేకమంది వైద్యులు, ఆరోగ్యం రంగ నిపుణులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఈ మహమ్మారితో నెలకొంటున్న విషాదాలను తెలుపుతూ జాగ్రత్తగా ఉండాలని పదేపదే ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ముంబయికి చెందిన ఫిజీషియన్ డాక్టర్ తృప్తి గిల్డా వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కరోనా ఉద్ధృతితో ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని, తామంతా నిస్సహాయులుగా మారిపోయామని కంటతడి పెట్టుకున్నారు. మహారాష్ట్రలో దాదాపు 18వేల మందికి పైగా వైద్యులు కొవిడ్‌బారిన పడగా.. వారిలో 168మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరత.. ఇప్పుడే ఎందుకిలా..?
ఇదీ చదవండి: మహారాష్ట్రలో మే 1 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్