కరోనాను జయించినవారిని కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్(మ్యుకర్‌మైకోసిస్) గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉన్న వారిలో అది ఎలాంటి ప్రభావం కలిగించదని తెలిపారు.
''బ్లాక్ ఫంగస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంది. అయితే.. ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఇది ఎలాంటి ప్రభావం చూపించదు. ఇది ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించవచ్చు. కానీ అవకాశాలు చాలా తక్కువ. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే.. మనం దానితో పోరాడవచ్చు.''
- డా. నిఖిల్ టాండన్, ఎయిమ్స్ వైద్యులు
మ్యుకర్‌మైకోసిస్ కారణంగా అంధత్వం మాత్రమే కాకుండా.. పళ్లు, దవడలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని తొలగించాల్సిన పరిస్థితులు వస్తాయని తెలిపారు. అయితే.. సకాలంలో చికిత్స చేస్తే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు. సైనస్ నుంచి ప్రారంభమై.. మెల్లగా దవడల్లో నొప్పి మొదలవుతుందని, ఆ తర్వాత ఎముకలు క్షీణిస్తాయని ప్రముఖ దంతవైద్య నిపుణులు డా. నేహల్ పటేల్ పేర్కొన్నారు.
''నా ముఖం ఎడమభాగం తిమ్మిరిపట్టింది. కళ్ల నుంచి నీరు కారడం, ఎర్రగా మారడం కనిపించాయి. నా పైదవడ ఎడమవైపున్న పళ్లు కూడా మొద్దుబారిపోయాయి. ఇప్పుడు కాస్త బాగానే ఉన్నాను. నాకు శస్త్రచికిత్స జరిగింది.''
- పుష్కర్ సారన్, బాధితుడు
చిన్న పేగుల్లోనూ..
బ్లాక్ ఫంగస్ చిన్నపేగుల్లోనూ వెలుగుచూస్తున్నట్లు దిల్లీలోని శ్రీ గంగారాం ఆస్పత్రి వైద్యులు గుర్తించారు. కొవిడ్ బారిన పడిన ఓ వ్యక్తికి.. సీటీ స్కాన్ నిర్వహించగా అతని చిన్న పేగులో చిల్లులు పడినట్లు గమనించారు. అతనికి వెంటనే చికిత్స నిర్వహించి.. ఆ భాగాన్ని తొలగించినట్లు వివరించారు.
దీనిని బట్టి.. మ్యుకర్‌మైకోసిస్ సాధారణంగా ముక్కు, సైనస్, నాడీవ్యవస్థ, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్లు, గుండె, మూత్రపిండాలపై మాత్రమే కాకుండా పేగులు, దవడ ఎముకలపైనా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా శ్వాసవ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో.. ప్రస్తుతం ఈ ఇన్‌ఫెక్షన్‌ను ముక్కు, సైనస్ ప్రాంతాల్లో ఎక్కువగా గుర్తిస్తున్నట్లు వారు తెలిపారు. తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండి తెల్ల రక్తకణాల సంఖ్య తక్కువ ఉన్నవారిలో ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. ఇంకా స్టెరాయిడ్స్‌ను డాక్టర్ల సలహా మేరకే వాడాలని సూచిస్తున్నారు.