Noorjahan Mangoes: వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి. పండ్లలో రారాజుగా పిలుచుకునే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అని ప్రతీతి. బంగిన్‌పల్లి, రసాల్ వంటి రకారకాల పండ్ల ధరలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన 'నూర్జహాన్' రకం మామిడి పండు మాత్రం చాలా ప్రత్యేకం. వాటి బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు వాటి ధర రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలు పలుకుతోంది.
మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పుర్ జిల్లాలో పండే 'నూర్జహాన్' మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆప్ఘాన్ మూలానికి చెందిన 'నూర్జహాన్' మామిడిని అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారు. అయితే గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం ఈసారి పెద్దగా ఉండడం వల్ల ఒక్కోటి ఈ సీజన్‌లో రూ. 1000 నుంచి రూ.2000 పలుకుతోందని వాటిని పండించిన రైతులు పేర్కొంటున్నారు.
"నా పండ్ల తోటలో మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 మామిడి పండ్లు పండుతున్నాయి. ఈ ఏడాది ఒక్కో పండును రూ.1000 నుంచి రూ.2000 వరకు విక్రయించాలని అనుకుంటున్నాం. చాలా మంది ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటారు. జూన్ 15 నాటికి అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ఈసారి 'నూర్జహాన్' మామిడి బరువు 3.5 కిలోల నుంచి 4 కిలోల మధ్య ఉంటుంది. 2021లో ఒక్కో పండు 3.80 కేజీల బరువుతో పండింది. అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,000 పలికింది. ఇక, ఈ భారీ-బరువు గల మామిడి పొడవు ఒక అడుగు, దాని విత్తనం 150 నుంచి 200 గ్రాముల బరువు ఉంటుంది " అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు.
ఇదీ చదవండి: 36 అంగుళాల వరుడు.. 34 అంగుళాల వధువు.. ఘనంగా పెళ్లి