మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని రాణి, సంకల్ప్ పరిహార్ దంపతుల కష్టాలు అన్నీఇన్నీకావు. సాధారణంగా పండ్ల తోటల్లోకి ఇతరులు ప్రవేశించకుండా కంచె వేస్తుంటారు. అవసరమైతే ఒకరో ఇద్దరో కాపలా ఉంటారు. కానీ పరిహార్ దంపతులు మాత్రం తమ మామిడి చెట్లకు ఆరుగురు గార్డులను, 9 శునకాలను కాపలాగా ఉంచారు. ఎందుకంటే అవి మామూలు మామిడి చెట్లు కాదు.. వారి పాలిట కల్ప వృక్షాలు.
వార్తలతోనే దొంగల బెడద..
పరిహార్ దంపతుల తోటలో ఉన్నవి జపాన్‌కు చెందిన మియాజాకీ రకపు మామిడి పండ్లు. అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది వీటి ధర కిలో రెండు లక్షల 70 వేలకు పైగా పలికింది. ఈ విషయం మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. అంతే దొంగల బెడద మొదలైందంట.
కొద్దిరోజులకు.. కొంతమంది దొంగలు మామిడి పండ్లను దోచుకెళ్లారని చెప్పారు సంకల్ప్. దీంతో పరిహార్ దంపతులు ఈ ఏడాది ఆరుగురు సెక్యూరిటీ గార్డులను, 9 శునకాలను కాపలాగా పెట్టుకున్నారు. ఇందుకుగాను నెలకు సుమారు రూ.50 వేల వరకు ఖర్చు అవుతుందని దంపతులు పరహార్ దంపతులు చెప్తున్నారు.
షిఫ్టుల్లో..
ఆ ఖరీదైన మామిడి పండ్లను రక్షించేందుకు.. ఇప్పుడు గార్డులు, శునకాలు రేయింబవళ్లు పహారా కాస్తున్నాయి.
- సిబ్బంది రెండు షిఫ్టుల్లో 24 గంటలూ పనిచేస్తారు. 7 శునకాలు తోటలోని తలో దిక్కు కాపలా కాస్తే.. రెండు శునకాలతో చుట్టూ కలియతిరుగుతారు సెక్యూరిటీ గార్డులు.
- రాత్రి పూట టార్చ్ లైట్లు పెట్టుకొని.. రక్షణగా ఉంటారు.
- ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగానే కుక్కలు అరుస్తాయి. వెంటనే గార్డులు అప్రమత్తం అవుతారు.
14 రకాల పండ్లు.. అన్నీ ప్రత్యేకమే..
జపాన్‌లో ఇవి 'తైయో నో టమాగో' రకానికి చెందినవి. వీటినే ఎగ్ ఆఫ్ ది సన్ అని కూడా పిలుస్తారు. ఇంకా.. జపాన్‌లో పండించే వివిధ రకాల మామిడి పండ్లను పరిహార్ దంపతులు సాగు చేస్తున్నారు. జబల్‌పుర్‌లోని చార్గ్వన్ రోడ్డు ప్రాంతంలో ఉన్న పరిహార్ దంపతుల గార్డెన్లో సుమారు 14 రకాల మామిడి పండ్లు దర్శనమిస్తాయి. వీటిలో కొన్ని పర్పుల్, పింక్ రంగుల్లో పండుతాయి.
జపాన్ నుంచి ఎలా?
తానొకసారి చెన్నై వెళ్తున్న సమయంలో రైల్లో ఓ వ్యక్తి ఈ మొక్కలను ఇచ్చాడన్న పరిహార్.. మియాజాకీ మామిడి పండ్లనే విషయం తెలియకుండానే సాగుచేసినట్లు తెలిపారు. మామిడి పండ్ల కోసం పలువురు తమను సంప్రదిస్తున్నారని ఐతే వీటిని అమ్మడం లేదని చెబుతున్నారు.
వీటిని పరిశీలించిన మధ్యప్రదేశ్ హార్టీకల్చర్ విభాగం అధికారులు అరుదైన జాతికి చెందినవి కావటంతోనే అధిక ధర ఉన్నట్లు తెలిపారు. జబల్‌పుర్‌లోని జవహర్ లాల్ నెహ్రూ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మియాజాకీ మామిడి పండ్లపై పరిశోధనలకు సిద్ధమవుతున్నారు.
"ఈ సాగు చేయడానికి చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది. తక్కువ దిగుబడి ఉండటం వల్ల మొదట దీని కొనుగోలుకు ఎవరూ మొగ్గు చూపేవారు కాదు. కానీ క్రమంగా దీనికి డిమాండ్ పెరిగింది. జపాన్‌లో ఈ పండ్లను బహిరంగ ప్రదేశాల్లో పండించరు. కానీ భారత్‌లో బహిరంగ ప్రదేశాల్లో సాగు చేసేందుకు కూడా వాతావరణం అనుకూలంగా ఉంది. వీటిలో ఎలాంటి పీచు పదార్థం ఉండటమే కాక పండు కూడా చాలా రుచిగా ఉంటుంది."
-రాణి పరిహార్
ఇటీవల ఈటీవీ భారత్‌లోనూ ఈ మామిడికాయలకు సంబంధించిన కథనం ప్రసారమైంది. అప్పటినుంచి ఇంకా వీటి గురించి చర్చించడం పెరిగిందని చెబుతున్నారు పరిహార్ దంపతులు. ఈ మామిడికాయల గురించి తెలుసుకోవడానికి.. ఉత్తరాఖండ్, హైదరాబాద్, ముంబయి నుంచి ఫోన్లు చేస్తున్నారని వివరించారు. వీటి సాగును ఇంకా పెంచాలని చూస్తున్నామని.. అయితే అదే రీతిలో తమకు దొంగల భయం కూడా ఉందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మామిడి పండు అ'ధర'హో- కేజీ రూ.2లక్షలు