మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. తనపై ప్రేమ చూపించడం లేదనే కారణంతో తల్లిని కాల్చి చంపాడు ఓ మైనర్. అనంతరం తానే తల్లిని కాల్చి చంపినట్లు పోలీసులకు ఫోన్‌చేసి చెప్పాడు నిందితుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
టీకమ్గఢ్ జిల్లాలోని దేహత్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రమేశ్ రజక్ అనే వ్యక్తి తన భార్య.. సప్న రజక్, ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్నాడు. రమేశ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వారి 17 ఏళ్ల కుమారుడు తల్లి సప్నతో ఏదో విషయంలో గొడవపడ్డాడు. తల్లి ఎంత వారించినా సరే వినలేదు. దీంతో తల్లిపై మరింత కోపం తెచ్చుకున్నాడు. ఆవేశంలో ఉన్న మైనర్.. ఇంట్లో ఉండే తన తండ్రి లైసెన్స్డ్ తుపాకీతో తల్లి ఛాతిపై కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే హత్య చేసిన అనంతరం ఆ నిందితుడే పోలీసులకు సమాచరం అందించాడు. సమాచారం అందున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి నిందితుడు.. కొంచెం కూడా పశ్చాత్తాపం చెందకుండా.. ప్రశాంతంగా కుర్చీపై కూర్చొని ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
తన తల్లి తనను ప్రేమించడం లేదని.. ఎప్పుడు చూసినా గొడవపడేదని తెలిపాడు. తల్లి ఇలా ప్రవర్తించడం వల్ల తనకు కోపం వచ్చేదని నిందితుడు విచారణలో భాగంగా పోలీసులకు వెల్లడించాడు. ప్రస్తుతం నిందితుడికి ఓ సోదరుడు ఉన్నాడు. అతడు ఇప్పుడు ఇందోర్‌లో చదువుతున్నాడు. అయితే ఈ కేసులో పోలీసులు నిందితుడు తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
పేదరికం కారణంగా పండంటి బిడ్డను చంపిన తల్లి..
ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. రెండు నెలల వయసున్న చిన్నారిని కన్న తల్లే కడతేర్చింది. ఆదివారం ఉదయం తమ చిన్నారి కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి ఇంటి పక్కనే ఉండే కాలువలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి తల్లిపై అనుమానం వచ్చి విచారించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమెను మరింత లోతుగా విచారించగా.. తానే ఈ హత్య చేసినట్లు అంగీకరించింది. పేదరికం కారణంగా తన బిడ్డను సరిగా చూసుకోలేకపోతున్నానని.. బిడ్డని భవిష్యత్తులో ఎలా పెంచాలో తెలియకే చిన్నారిని కాలువలో పడేసి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో నిందితురాలిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు ఎస్ఎస్పీ రాజేశ్ తెలిపారు.