మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన జరిగింది. డబ్బుల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఓ ఆస్పత్రి వైద్యులు. డబ్బులు తెచ్చాకే.. ఆపరేషన్ చేస్తామంటూ తిరిగి పంపించారు ఆస్పత్రి సిబ్బంది. డబ్బులు తీసుకుని వచ్చేసరికి నవ జాతి శిశువు ప్రాణం లేకుండా జన్మించింది.
అసలేం జరిగిందంటే.. సింగరౌలీ జిల్లాలో సోమవారం ఉదయం దినేశ్ భారతీ అనే వ్యక్తి.. తన భార్య మీనా భారతీ డెలివరీ కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అక్కడ డాక్టర్ తమకు కుదరదన్నారు. దీంతో డెలివరీ కోసం ఓ ప్రైవేట్ క్లీనిక్‌కు తీసుకుపోయాడు. ఆ క్లీనిక్‌లో సిబ్బంది రూ. 5000 ఫీజు అడగగా.. తన దగ్గర రూ.3 వేలు మాత్రమే ఉన్నాయని.. తన భార్యను అడ్మిట్ చేసుకోవాలని దినేశ్ కోరాడు. మిగిలిన డబ్బులు తర్వాత చెల్లిస్తానని చెప్పినా.. ఆ సిబ్బంది అతడి మాటలను పట్టించుకోకుండా.. మరుసటి రోజు రమ్మని చెప్పారు. దీంతో చేసేదేమి లేక తన భార్యను తర్వాత రోజు క్లినిక్‌కు తీసుకెళ్లాడు. అప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా.. కడుపులో బిడ్డ చనిపోయిందని తెలిసింది. దీంతో మరణించిన శిశువును బయటకు తీసేందుకు మళ్లీ ప్రభుత్వాస్పత్రికి తీసుకుపోవాలని సదరు సిబ్బంది సూచించగా.. దినేశ్ తన భార్యను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి డెలివరీ చేయించాడు.
అయితే ఆ చనిపోయిన బిడ్డను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి.. బాధితుడు అంబులెన్స్‌ను కోరగా.. సిబ్బంది నిరాకరించారు. దీంతో తమకు సహాయం చేయాలని కోరుతూ.. బిడ్డ మృతదేహాన్ని బైక్ సైడ్ బాక్స్‌లో పెట్టుకుని జిల్లా కలెక్టర్ రాజీవ్ రంజన్ మీనా వద్దకు వెళ్లాడు బాధితుడు. జరిగిన ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన అధికారి.. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.