Mother: అమ్మ.. సృష్టిలో ఓ గొప్ప దేవత. తన బిడ్డైనా.. పర బిడ్డైనా ఆపదలో ఉందంటే క్షణం కూడా ఆలస్యం చేయకుండా కాపాడుకుంటుంది. ఎవరి పాడు చూపు బిడ్డల మీద పడకుండా రక్షించుకుంటుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతుంది. అది తగ్గేవరకు కంటి మీద కునుకు అన్నది లేకుండా కాచుకుంటది. పిల్లల ప్రాణాల కోసం ఎవరితో అయినా.. ఎంతవరకైనా పోరాడుతుంది. అలాంటి తల్లులు ఎందరో ఉన్నారు. కానీ ఈ తల్లి మాత్రం అమ్మ తనానికి.. ఆడ జాతికి మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. నవమాసాలు మోసి కడుపున పుట్టిన పిల్లలనే.. భర్త పరం చేసింది.
మాతృత్వానికి మచ్చతెచ్చేలా ఓ కన్నతల్లి అత్యంత దారుణంగా వ్యవహరించింది. వయసొచ్చిన తన కుమార్తెలను రెండో భర్త పరం చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. కుమార్తెల ఫిర్యాదుతో దిశ పోలీసులు గురువారం తల్లిని, ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళకు భర్త, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది.
ఆ తర్వాత 2007లో ఆమె భర్త అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె తన మేనత్త కొడుకును రెండో వివాహం చేసుకుంది. అయితే తనకు పిల్లలు కావాలని, లేదంటే వేరే పెళ్లి చేసుకుంటానని అతడు ఆ మహిళను బెదిరించేవాడు. కొన్ని సంవత్సరాలకు.. ఆడపిల్లలు ఇద్దరూ యుక్తవయసుకు వచ్చారు. ఈ క్రమంలో ఆ తల్లి తన కుటిల బుద్ధిని చూపించింది. వేరే పెళ్లి చేసుకుంటే తనకు దక్కడనే ఆలోచనతో కూతుర్లను ఎరగా వేసింది. వేరే పెళ్లి వద్దని, తన కుమార్తెలతోనే పిల్లల్ని కనాలని తన రెండో భర్తకు సూచించింది.
అందుకు అతడు అంగీకరించాడు. పెద్ద కుమార్తె మొదటిసారి గర్భవతి అయినప్పుడు.. చదువు ఆగిపోతుందని అబార్షన్ చేయించింది. మరోసారి గర్భవతి అయ్యి ఆడబిడ్డకు జన్మించింది. మగ బిడ్డ కావాలని సతీష్ చెప్పడంతో.. ఈసారి ఆ తల్లి తన రెండో కుమార్తెను అతడి వద్దకు పంపించింది. ఆమె కూడా గర్భం దాల్చడంతో ఇంటిలోనే ప్రసవం చేశారు. ప్రాణం లేని మగశిశువు పుట్టడంతో ఆ బిడ్డను కాలువలో పడేశారు. భార్యభర్తలకు గొడవలు రావడం.. పుట్టింటికి వెళ్లడంతో.. కుమార్తెలిద్దరినీ శారీరకంగా, మానసికంగా హింసించాడు. ప్రస్తుతం పెద్ద కుమార్తె మూడో నెల గర్భిణి.
అలా వెలుగులోకి: భర్తతో గొడవల వల్ల కూతుర్లను వదిలిపెట్టిన వెళ్లిన తర్వాత.. ఆమె చిన్న కుమార్తె తనకు పరిచయమైన యువకుడికి ఇదంతా చెప్పింది. దీంతో అతడు ఈ మొత్తం విషయాన్ని పిల్లల మేనమామకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు అందరూ.. ఏలూరు వచ్చి బాధితులతో దిశ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు ఇప్పించారు. ఈ దారుణ ఘటనపై దిశ సీఐ ఇంద్రకుమార్ కేసు నమోదు చేసుకుని.. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఆడబిడ్డలకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.