ప్రాంతీయ తీవ్రవాదాన్ని నిర్మూలించినప్పుడే సుస్థిర ప్రగతి, వాణిజ్యం సాధ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్య దేశాల అధినేతల 19వ సమావేశానికి వెంకయ్యనాయుడు అధ్యక్షత వహించారు. ఎస్సీఓలో భారత్ పూర్తిస్థాయి సభ్యదేశమైన తర్వాత తొలిసారి.. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది.
వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి.. పరోక్షంగా మరో సభ్యదేశమైన పాకిస్థాన్ తీరును ఎండగట్టారు. ఎస్సీఓ చార్టర్‌కు విరుద్ధంగా ద్వైపాక్షిక అంశాలను కొన్ని దేశాలు ప్రస్తావించడం సరికాదని సూచించారు. తీవ్రవాదంపై పోరుకు కలిసి రావాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు వెంకయ్య.
శాంతి ఉన్నప్పుడే ఆర్థిక ప్రగతి, వాణిజ్యం సాధ్యపడతాయి. మేము ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ప్రాంతీయ తీవ్రవాదం. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం. మానవత్వానికి తీవ్రవాదం నిజమైన శత్రువు. దీనిపై మనం సంయుక్తంగా పోరాడాల్సిఉంది. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నప్పటికీ భారత్ ఖండిస్తుంది. పాలనలేని ప్రాంతాల నుంచి ఎదురయ్యే సమస్యలను మేము గుర్తుచేస్తున్నాం. కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని జాతీయ విధానంలో పనిముట్టుగా చేసుకోవడాన్ని ముఖ్యంగా ప్రస్తావిస్తున్నాం. అలాంటి విధానాలు షాంఘై సహకార సంస్థ స్ఫూర్తి, ఆలోచన, చార్టర్‌కు పూర్తి విరుద్ధం. ఈ ముప్పును నివారించినప్పుడే మన దేశాల్లో పరిస్థితులు సాధారణంగా ఉండి, ఆర్థిక ప్రగతికి భద్రత, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతాయని గ్రహించాలి.
---- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.
ఇదీ చూడండి- నూతన సాగు చట్టాలతో రైతులకు మేలే: మోదీ