ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌కు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తారు. ఈ యాత్రా సీజన్‌లో ఏకంగా 15 లక్షల మంది కేదార్‌నాథ్ క్షేత్రాన్ని సందర్శించారు. మరో పది రోజుల పాటు ఈ క్షేత్రం తెరిచి ఉంటుంది. దీపావళి ముందు ప్రధాని నరేంద్రమోదీ సైతం.. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లను సందర్శించే అవకాశం ఉంది.
కేదార్‌నాథ్‌లో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. మంచు కొండలు ఎండలో వెండిలా మెరుస్తున్నాయి. రికార్డు స్థాయిలో యాత్రికుల రాకతో స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కేదార్‌నాథ్‌కు పాదయాత్ర మార్గంలోను, హెలికాప్టర్ మార్గంలోను భక్తులు విచ్ఛేస్తున్నారు. బాబా కేదార్ దర్శనం కోసం తరలివచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. సకాలంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయడం వల్ల.. భక్తులు ఎక్కువ సేపు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయింది. పాదచారులు వెళ్లే కాలినడక మార్గంలో నీటి సౌకర్యం, పారిశుద్ధ్య వ్యవస్థ, రెయిన్ షెల్టర్, టోకెన్ సిస్టమ్ తదితర సదుపాయాలు కల్పించారు.