మహారాష్ట్ర ముంబయిలో మూడంతస్తుల భవనం కూలిన ఘటనలో 11మంది మృతిచెందారు. మృతుల్లో 8మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి 11.15గంటలకు మలాడ్ వెస్ట్ మల్వాని ప్రాంతంలోని న్యూ కలెక్టర్ కాంపౌండ్లో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
తొలుత ఒకే అంతస్తుగల భవనం కూలిందని తెలిపిన అధికారులు.. తర్వాత అది మూడంతస్తుల భవనమని స్పష్టం చేశారు. అయితే.. ఇది అక్రమంగా నిర్మించిన భవనమని ఘటన అనంతరం పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి కాంట్రాక్టర్ను ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
మృతుల్లో రెండు వేర్వేరు కుటంబాలకు చెందిన వారు ఉన్నారని అధికారులు తెలిపారు. గాయాలైన ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 15 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి అస్లామ్ షేక్ ప్రకటించారు.
ఇదీ చదవండి:ఐదుగురు కుమార్తెలతో తల్లి రైలు కిందపడి..