పార్టీలో అంతర్గత ప్రక్షాళన కోసం తాము లేవనెత్తిన అంశాన్ని కొంతమంది దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ(Veerapap Moily) చెప్పారు. 23 మంది నేతలు(జి-23)(G23 Congress) కలిసి కోరుకున్న రీతిలో పార్టీలో సంస్కరణలను అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే మొదలు పెట్టారని అదివారం ఆయనొక వార్తాసంస్థకు తెలిపారు.
"పార్టీలో సంస్కరణలు, అంతర్గతంగా రావాలనే ఉద్దేశంతోనే మాలో కొందరు గతంలో లేఖపై సంతకాలు చేశాం. పార్టీ పునర్నిర్మాణం జరగాలనేది మా కోరిక అంతేగానీ పార్టీ నాశనాన్ని మేం కోరుకోవడం లేదు. అట్టడుగు స్థాయి నుంచి ప్రక్షాళనకు సోనియాగాంధీ చర్యలు చేపట్టినందువల్ల జి-23 అనే ఆలోచనకు మేం ఇక దూరం. ఇప్పుడు దీనికి అర్థం లేదు. దీని అవసరమే లేదు."
-వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
'ఎవరైనా జి-23 గురించి పట్టుపడుతున్నారంటే.. దాని వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నట్లే' అని వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ప్రక్షాళన నిమిత్తం తాను కోరుకున్న 'భారీ శస్త్రచికిత్స మొదలైందని, సోనియాగాంధీ చురుగ్గా వ్యవహరిస్తూ అవసరమైన నిర్ణయాల్ని తీసుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి తీసుకోవడాన్ని ఆయన సమర్థించారు. విపక్ష కూటమికి వెన్నెముకగా తమ పార్టీ నిలుస్తుందని చెప్పారు.
ఇదీ చూడండి: కమలదళంలో ఎందుకీ 'ముఖ్య' మార్పులు?