దేశంలోని మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం వల్లనే మళ్లీ మళ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. బిహార్ ఫర్బిస్గంజ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. ఈ విషయాన్ని వెల్లడించారు.
"మోదీ ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ప్రజలు అడుగుతుంటారు. దేశంలో తల్లులు, కూతుర్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటమే మోదీ విజయానికి కారణం. అందుకే మోదీకి ఎప్పుడూ తల్లుల ఆశీర్వాదం ఉంటుంది.
బిహార్లో గత దశాబ్ద కాలంగా ప్రతి ఇంటికి విద్యుత్, వంటగ్యాస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి నుంచి 2030 వరకు బిహార్ ప్రజల ఆకాంక్షాలను మరింతగా నెరవేర్చే సమయం వచ్చింది."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మోదీ. వాళ్లు సమాజాన్ని విభజించటమే నేర్చుకున్నారని విమర్శించారు. ప్రజలను దోచుకుంటున్నారని, కానీ అందరికీ నిజాలెంటో తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజలను ఎప్పటికీ మోసం చేస్తామనుకోవటం పొరపాటు అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అదే జరిగిందని ఎగతాళి చేశారు.
ఇదీ చూడండి: బిహార్లో బరి: రెండో విడతలో ఓటేసిన ప్రముఖులు