Modi third time PM: ప్రధానమంత్రి పదవిలో కొనసాగడంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు విశ్రాంతి తీసుకోవాలన్న ఉద్దేశం అసలే లేదని వ్యాఖ్యానించారు. రెండుసార్లు ప్రధాని పదవి చేపడితే అంతా అయిపోయినట్లు కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ విపక్ష నాయకుడి మాటలను గుర్తు చేసుకున్నారు. గుజరాత్ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం పొందుతున్న వృద్ధులు, వితంతువులు, పేద ప్రజలతో మోదీ వర్చువల్‌గా ముచ్చటించారు. ఈ సందర్భంగా తాజా వ్యాఖ్యలు చేశారు.
"ఒకరోజు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు నన్ను కలిశారు. రాజకీయంగా నన్ను ఆయన తరచుగా విమర్శిస్తుంటారు. కానీ నేను ఆయనను గౌరవిస్తాను. ఆయనకు కొన్ని విషయాలపై ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నన్ను కలిసేందుకు వచ్చారు. అప్పుడు ఆయన.. 'మోదీజీ.. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానిని చేసింది. మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు?' అని అడిగారు. రెండుసార్లు ప్రధాని అయితే అన్నీ సాధించినట్టేనని ఆయన అభిప్రాయంతో ఉన్నారు. కానీ, మోదీ అందరికంటే చాలా భిన్నమని ఆయనకు తెలీదు. మోదీ గుజరాత్ గడ్డ మీద పెరిగాడు. అందుకే నేను దేన్నీ అంత తేలికగా తీసుకోను. విశ్రాంతి తీసుకోవాలని అనుకోను. సంక్షేమ పథకాలను వంద శాతం మంది లబ్ధిదారులకు అందేలా చూడటమే నా కల."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
అయితే, ఆ విపక్ష నేత ఎవరన్నది మోదీ పేర్కొనలేదు. అయితే, గత నెలలో ఎన్సీపీ నేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ మోదీని దిల్లీలో కలిశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఒత్తిడి పెంచిన నేపథ్యంలో మోదీని కలిశారు పవార్.
ఇదీ చదవండి: ఆ యువతి సమాధానంతో ప్రధాని మోదీ భావోద్వేగం