Modi Mann Ki Baat today: దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇవి కేవలం సౌకర్యాలను పెంచడమే కాకుండా నిజాయితీతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. చిన్న ఆన్‌లైన్ చెల్లింపులే పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో దోహదం చేస్తున్నాయన్న మోదీ.. ఈ క్రమంలో కొత్తగా ఎన్నో ఫిన్‌టెక్ స్టార్టప్‌లు వస్తున్నాయని అన్నారు. ప్రతినెల చివరి ఆదివారం నాడు దేశప్రజలనుద్దేశించి నిర్వహించే 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ ఈ విధంగా ప్రసంగించారు.
" దేశవ్యాప్తంగా ప్రతిరోజు రూ.20వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. కేవలం ఒక్క మార్చి నెలలోనే యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలు రూ.10లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి కేవలం సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా నిజాయితీ గల వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు, స్టార్టర్‌కు సంబంధించిన సొంత అనుభవాలను ఇతరులతోనూ పంచుకోవాలి. ఇలా పంచుకునే స్వీయ అనుభవాలే దేశంలో ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ఏప్రిల్ 14న బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించిన ప్రధానమంత్రి సంగ్రహాలయానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎంతో మంది లేఖలు, సందేశాలు పంపిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రుల సేవలకు గుర్తుగా వారిని స్మరించుకునేందుకు 75వ స్వాతంత్య్ర వేడుకలకు మించి మరో మంచి సమయం లేదన్నారు. ఇక క్రీడల్లో మాదిరిగా ఆర్ట్స్, విద్యారంగంతో పాటు ఇతర రంగాల్లో దివ్యాంగులు ఎన్నో విజయాలు సాధిస్తున్నారని మోదీ గుర్తుచేశారు. సాంకేతికతను ఉపయోగించుకొని దివ్యాంగులు ఉన్నత శిఖరాలను సాధించగలుగుతున్నారంటూ వారిని ప్రశంసించారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగలు: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కీలక సూచనలు చేశారు మోదీ. మే నెలలో వచ్చే పండుగల సందర్భంలో ప్రజలు తప్పకుండా కొవిడ్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. మాస్కులు ధరిస్తూ, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ఈద్, అక్షయ తృతీయ, భగవాన్ పరుశురామ్ జయంతి, బుద్ధ పౌర్ణిమ వంటి ఉత్సవాలు రానున్నాయని, ఆ పండుగలను జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు. ఆయా పండుగల నేపథ్యంలో ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను ఆనందంగా, సామరస్యంతో జరుపుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం.. కొత్త పంథాలో అభివృద్ధి'