Modi Kashi corridor: కాశీ విశ్వనాథ్ మందిర చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని, దీన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడం అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారణాసిలో నిర్మించిన 'కాశీ విశ్వనాథ్ కారిడార్'ను ప్రారంభించిన ఆయన.. 'విశ్వనాథ్ ధామ్' ప్రాజెక్టు కేవలం భవనాల సముదాయం కాదని, భారతదేశ సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని చెప్పారు. భవిష్యత్ కోసం పూర్వీకులు అందించిన ప్రేరణ ఇక్కడ కనిపిస్తుందని తెలిపారు. ఈ అభివృద్ధి పనులు దేశానికి సరికొత్త దిశ, భవితను చూపిస్తాయని మోదీ అన్నారు.
ఆత్మనిర్భర భారత్ కోసం అలుపెరగని పోరాటం సహా స్వచ్ఛత, నవ కల్పనల కోసం పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని. మీ దగ్గర నుంచి కావాల్సింది ఇదేనంటూ వారణాసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ.
Modi in UP kashi news
కాశీక్షేత్ర అభివృద్ధి కారిడార్‌ను దేశ ప్రజలకు అంకితం చేసిన అనంతరం ప్రసంగించిన మోదీ.. ఈ ప్రాజెక్టుతో ఇబ్బందులు లేకుండా మందిరాన్ని దర్శించుకోవచ్చని అన్నారు.
"ఇక్కడకు రావడం గర్వంగా అనిపిస్తుంది. కాశీ అందరిది. గంగా అందరిది. విశ్వనాథుడి ఆశీస్సులు అందరివి. కానీ, సమయానుగుణంగా కాశీ విశ్వనాథుడిని, గంగాదేవిని దర్శించుకోవడం కష్టమైపోయింది. ఇక్కడ స్థలం ఇరుకుగా ఉండేది. కానీ 'విశ్వనాథ్ ధామ్' పూర్తి అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావడం సులభమవుతుంది. దివ్యాంగులు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మందిరాన్ని దర్శించుకుంటారు. 3000 వేల చదరపు అడుగులు ఉన్న మందిరాన్ని, 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించాం. 50 వేల మంది మందిరాన్ని దర్శించుకోవచ్చు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
వారణాసి ప్రత్యేకం..
ప్రపంచ చరిత్రలో వారణాసికి ప్రత్యేక స్థానం ఉందని మోదీ కొనియాడారు. ఎందరో సుల్తాన్లు పుట్టుకొచ్చినా, నేలకూలినా.. బెనారస్ మాత్రం అలాగే చెక్కుచెదరకుండా ఉందని అన్నారు.
''ఎందరో ఆక్రమణదారులు వారణాసిపై దండెత్తారు. ధ్వంసం చేయాలని చూశారు. ఔరంగజేబు కుట్రలు, దురాఘాతాలను చరిత్ర చెబుతోంది. కత్తి పట్టుకొని.. వారణాసిని మార్చేద్దామనుకున్నాడు. మతోన్మాదంతో సంస్కృతిని అణచివేసే ప్రయత్నం చేశాడు. కానీ ప్రపంచం కంటే భారతనేల భిన్నమైంది. ఇక్కడ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వస్తే.. అక్కడ మరాఠా యోధుడు శివాజీ కూడా పుట్టుకొచ్చాడు.''
- నరేంద్ర మోదీ, భారత ప్రధాని
అంతకుముందు, యూపీకి చేరుకున్న మోదీకి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానం పలికారు. వారణాసి ప్రజలు సైతం మోదీకి ఘనస్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ.. మోదీ, మహాదేవ్ నినాదాలు చేశారు. అనంతరం, లలితా ఘాట్ వద్ద గంగా నదిలో పుణ్యస్నానం చేశారు. నదిలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి.. పూజలు చేశారు. కలశంతో నదిలో పుష్పాలు వదిలారు.
కాశీ క్షేత్ర అభివృద్ధి కారిడార్ ప్రారంభోత్సవ నేపథ్యంలో వారణాసి పట్టణంలో ఇప్పటికే పండగ వాతావరణం నెలకొంది. ఆలయ పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కాగా, పట్టణ వీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులకు 2019 మార్చిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కాశీ ఆలయ సమీపంలోని భవనాలను కూల్చివేసి రహదారులను విస్తరించారు. టెంపుల్ చౌక్, వారణాసి సిటీ గ్యాలరీ, ప్రదర్శన శాల, బహుళ రీతిలో ఉపయోగించుకునే ఆడిటోరియాలు, హాళ్లు, ధ్యాన మందిరం, భక్తులు, అర్చకుల బస కేంద్రాలు, ఆధ్యాత్మిక పుస్తక కేంద్రాన్ని నిర్మించారు.
ఇదీ చదవండి: Modi Varanasi Visit: వారణాసిలో ప్రధాని మోదీపై పూలవర్షం