ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నీ తానై బిహార్‌లో ఎన్డీయే కూటమిని విజయపథాన నడిపించారు. ప్రస్తుత ఫలితాలను బట్టిచూస్తే కేవలం ప్రధానిపై ఉన్న ప్రజాభిమానమే అక్కడ అధికార కూటమిని గట్టెక్కించినట్లు కనిపిస్తోంది. కరోనా, నిరుద్యోగం, అధిక ధరల్లాంటి సమస్యలు అధికారపక్షాన్ని ఇబ్బందుల పాల్జేస్తాయని విశ్లేషకులు వేసిన అంచనాలు ఇక్కడ నిజం కాలేదు. కొవిడ్ వచ్చిన నాటినుంచి ప్రధానమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలతో పేదలు తమకు అండగా నిలిచారని భాజపా నాయకులు చెబుతున్నారు.
కొవిడ్ మహమ్మారినుంచి పొంచివున్న ప్రమాదం గురించి ప్రజలకు తొలి నుంచి విడమరిచి చెబుతూనే పేదలు పస్తులుండకుండా ఆత్మనిర్భర్ పేరుతో ప్రకటించిన ప్యాకేజీ ప్రధానిపట్ల సానుకూలతను పెంచిందని కాషాయదళం భావిస్తోంది. నీతీశ్ కుమార్‌పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా భాజపాకు స్థానికంగా బలమైన నాయకత్వం లేకున్నా ఎన్‌డీఏ గెలుపు తీరాలకు చేరిందంటే దానికి కారణం మోదీపై ప్రజలకున్న అభిమానమేనని కమలదళం విశ్వసిస్తోంది.
అమిత్ షా లేకున్నా..
అనారోగ్యం కారణంగా అమిత్‌షా బిహార్ ఎన్నికలపై అంతగా దృష్టి సారించకపోయినా, చిరాగ్ పాస్వాన్ రూపంలో ఎన్డీఏకి చికాకులు తలెత్తినా వాటన్నింటినీ మోదీకున్న ప్రజాభిమానం కనుమరుగు చేసినట్లు భాజపా సీనియర్ నేత ఒకరు చెప్పారు. మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉద్యోగాలు పోయాయని, రాహుల్‌గాంధీ ఇతర ప్రతిపక్షనేతలు ఎన్ని విమర్శలు చేసినా మోదీ తీసుకున్న నిర్ణయాలు పేదలను ఆదుకోవడంతో వారే పార్టీకి అండగా నిలిచినట్లు భాజపా నేతలు అభిప్రాయపడ్డారు.
సంక్షేమ పథకాలు..
గత ఏప్రిల్ నుంచి ఛట్‌పూజ వరకు ఉచిత రేషన్ ఇవ్వడం, జన్‌ధన్‌ఖాతాల్లో మహిళలకు డబ్బులేయడం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6వేల సాయం చేయడం ద్వారా మోదీ పేద ప్రజలతో బలంగా పెనవేసుకుపోయారని, అదే ఇప్పుడు ఎన్డీఏ కూటమి విజయానికి బాటలు వేసిందని చెప్పారు.
ప్రచార హోరు..
బిహార్‌లో మోదీ 12 సభల్లో ప్రసంగించారు. ఆ స్థానాలన్నింటిలోనూ ఎన్‌డీఏ విజయదుందుభి మోగించింది. మోదీ ప్రచారం చేయడంతో భాజపా శ్రేణులు పుంజుకొని మరింత కసితో పనిచేశాయని, అక్కడ కూటమి పార్టీలు వెనుకబడినా భాజపా మాత్రం పట్టువదలకుండా ముందడుగువేసి తనతోపాటు, మిత్రులను అధికారానికి దగ్గరచేసిందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.
మోదీ.. గేమ్ ఛేంజర్..
ఆర్‌జేడీ యువనేత తేజస్వీ యాదవ్ సభలకు ప్రజలు విపరీతంగా తరలిరావడంతో ఎన్డీఏ కూటమిలో కొంత ఆందోళన మొదలైంది. అలాంటి సమయంలో ప్రధాని మోదీ సభలు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితులు మారాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలన్నీ మహాకూటమికి అనుకూలంగా వచ్చినప్పటికీ ప్రధానిమోదీ మీద ఉన్న ప్రజాభిమానంపైనే అధికార కూటమి ఆశలు పెట్టుకొని విజయం కోసం ఎదురుచూసింది. చివరకు వారి ఆశలు నిజమయ్యాయి.
బిహార్ ఎన్నికల ప్రభావం వచ్చే ఏడాది జరిగే బంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని ఈ రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మరింత దూకుడుగా ముందడుగువేయడానికి తాజా ఫలితాలు ఉత్సాహాన్నిచ్చాయని ఆ పార్టీనేతలు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సీట్లు పెరిగినా భాజపాకు ఓట్లు మాత్రం తగ్గాయ్!