కరోనాపై భారత్ చేస్తున్న పోరాటం యావత్ ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థ రామచంద్ర మిషన్ వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. యోగా శిక్షణలో ఈ సంస్థ కృషిపై ప్రశంసలు మోదీ కురిపించారు. జీవితాలు వేగవంతమైన ప్రస్తుత తరుణంలో అంతా యోగాను అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా తర్వాత ప్రపంచంలో యోగా, ధ్యానంపై ప్రజలు మరింత ఎక్కువ దృష్టి సారిస్తున్నారని మోదీ తెలిపారు. ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అవసరమైన సమయంలో దానిని అందించినందుకు భారత్ గర్విస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్ కీలకపాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. గత ఆరేళ్లలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసిందని తెలిపారు.
"కరోనా వచ్చిన ఆరంభంలో భారత్ పరిస్ధితి పట్ల యావత్ ప్రపంచం ఆందోళన చెందింది. కాని కరోనాతో భారత్ పోరాటం మొత్తం ప్రపంచానికి ప్రేరణ కల్గిస్తోంది. ప్రపంచ బాగు కోసం మనుషులు కేంద్రంగా ఉండే దృక్పథాన్ని భారత్ అనుసరిస్తోంది. మనుషులు కేంద్రంగా ఉండే ఈ దృక్పథాన్ని ఆరోగ్యకరం, సమతౌల్యం, సంక్షేమం, ప్రజల బాగోగులు, సంపద అనే అంశాల ఆధారంగా అనుసరిస్తున్నాం. గత ఆరేళ్లలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టింది. పేదవాడికి గౌరవప్రద జీవితం, అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి