Mobile Tower Theft : బిహార్.. ముజఫర్‌పుర్‌లో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. 10 వ్యవధిలోనే మరో మొబైల్ టవర్‌ను చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. సికందర్పుర్లోని న్యూ కాలనీ బాలుఘాట్‌లో ఆదివారం జరిగిందీ ఘటన.
ఇదీ జరిగింది..
న్యూకాలనీ బాలుఘాట్‌లో జీటీఎల్ కంపెనీకి చెందిన మొబైల్ టవర్ ఉంది. దీనిని పరిశీలించేందుకు ఆ సంస్థ ఉద్యోగులు వచ్చారు. ఈ క్రమంలో టవర్ చోరీకి గురైనట్లు వారు గుర్తించారు. వెంటనే సికందర్పుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీటీఎల్ కంపెనీ ఉద్యోగుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. గుర్తు తెలియని దొంగలపై కేసు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా మొబైల్ టవర్ మూతపడి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దాదాపు నాలుగైదు నెలల క్రితం టవర్ చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. 'ముజఫర్‌పుర్‌లో ఏప్రిల్ 15న మొబైల్ టవర్ దొంగతనంపై కేసు నమోదైంది. 4 నుంచి 5 నెలల క్రితమే టవర్ చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. త్వరలోనే దొంగలను పట్టుకుంటాం. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాం.' అని ముజఫర్‌పుర్ డీఎస్పీ రాఘవ్ దయాల్ తెలిపారు.
10 రోజుల క్రితమే..
మరోవైపు 10 రోజుల క్రితమే బిహార్‌లోని ముజఫర్‌పుర్‌లో మొబైల్ టవర్‌ను చోరీ చేశారు దొంగలు. టవర్ సంస్థ ప్రతినిధులమంటూ చట్టుపక్కల వారిని నమ్మించి చోరికి పాల్పడ్డారు. టవర్ మొత్తాన్ని భాగాలుగా విడగొట్టి వాహనంలో ఎత్తుకెళ్లిపోయారు. దాంతో పాటు జనరేటర్, స్టెబిలైజర్, మిగతా వస్తువులు సైతం తీసుకెళ్లిపోయారు. దొంగలు చేసిన ఈ పనికి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మొబైల్ టవర్ ప్రతినిధులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌పుర్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రమజీవి నగర్లో ఉన్న మొబైల్ టవర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. GTAL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థకు చెందిన మొబైల్ టవర్‌ను.. మనీషా కుమారి అనే మహిళ ఇంటి సమీపంలో ఏర్పాటు చేశారు. దీన్నే దొంగలు చోరి చేశారు. ఘటనపై కంపెనీ ప్రతినిధి షానవాజ్ అన్వర్.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల వారిని విచారించారు. కానీ పోలీసులకు ఎలాంటి సమాచారం లభించలేదు. సాంకేతిక కారణాల రీత్యా.. కొన్ని నెలలుగా టవర్ పనిచేయడం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో రిపేర్ చేసేందుకు.. కంపెనీ ప్రతినిధులు అక్కడికి వచ్చారు. టవర్ అక్కడ లేకపోవడం చూసి.. పోలీసులకు సమాచారం అందించారు.