MLA Mynampally Hanmantha Rao Resigned BRS : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ( Mynampally Hanmantha Rao) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావును ఇటీవల భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే తనకు మల్కాజిగిరి, కుమారుడికి మెదక్ టికెట్‌ను మైనంపల్లి హన్మంతరావు ఆశించారు. కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వలేదని ఆయన అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం పట్ల బీఆర్ఎస్ అధిష్ఠానం కూడా మైనంపల్లి హన్మంతరావుపై ఆగ్రహంతో ఉంది.
మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలను కేటీఆర్, కవితతో పాటు పలువురు నాయకులు బహిరంగంగానే ఖండించారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి అభ్యర్థిని మారుస్తారని ఓ వైపు.. మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరతారని మరోవైపు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వీడుతున్నట్లు మైనంపల్లి హన్మంతరావు అధికారికంగా ప్రకటించారు. ఏ పార్టీలో చేరనున్నది త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.
అసలేం జరిగిదంటే : ఇటీవలే మైనంపల్లి హన్మంతరావు తిరుమలలో బీఆర్ఎస్ కీలక నేత మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మెదక్ నియోజకవర్గంలో హరీశ్‌రావు పెత్తనమేంటని ప్రశ్నించారు. మెదక్‌లో మంత్రి నియంతగా వ్యవహరిస్తున్నారని.. ఆయన తన గతం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. సిద్దిపేట మాదిరిగా హరీశ్‌రావు మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించిన ఆయన.. హరీశ్‌రావు మెదక్ జిల్లా అభివృద్ధి కాకుండా చేశారని ధ్వజమెత్తారు. అయినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావును ప్రకటించారు.
అనంతరం మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను ఏ రాజకీయ పార్టీని దూషించనని.. ప్రాణం పోయే వరకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పర్యటించిన అనంతరం.. వారం రోజుల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వివరించారు. గతంలో తాను అమెరికా నుంచి భారత్ తిరిగొచ్చిన తర్వాత.. రాజకీయాల్లో చేరానని.. అప్పట్లో టీడీపీ మెదక్ జిల్లాలో అధ్యక్షుడిగా ఎనిమిది ఏళ్లు పని చేశానని మైనంపల్లి హన్మంతరావు గుర్తు చేశారు.
మెదక్ జిల్లాలో రామాయంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని.. తనకు మెదక్ ప్రజలు రాజకీయ భిక్ష పెట్టారని మైనంపల్లి హన్మంతరావు పేర్కొన్నారు. ఆ తర్వాత తెలంగాణ కోసం టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరానని వివరించారు. ఉద్యమంలో ప్రజలంతా కలిస్తే తెలంగాణ సాకారమైందని.. ప్రాణం పోయే వరకు మాటపైన ఉంటానని వ్యాఖ్యానించారు. ఎవరైనా తన జోలికి వస్తే ఉపేక్షించనని మైనంపల్లి హెచ్చరించారు.
MLA Mynampally Latest Comments : 'నన్ను ఇబ్బంది పెడితే.. రియాక్షన్ ఇలాగే ఉంటుంది'