అధికార దర్పం పక్కనపెట్టి ఆసుపత్రిలో నేలను తుడిచి ఆశ్చర్యపర్చారు మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్ లాల్జిర్లియానా. అది కూడా కరోనాతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న వేళ. ఆసుపత్రిలో నేల శుభ్రం చేస్తున్న చిత్రం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
'ఆసుపత్రిలో నేలను తుడిచి నేను వైద్యులు, నర్సులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. నేనొక ఉదాహరణగా నిలిచి, ఇతరులకు అవగాహన కల్పించాలన్నదే నా ఆలోచన' అని ఆ మంత్రి మీడియాతో అన్నారు. తానున్న గది అపరిశుభ్రంగా ఉండటంతో స్వీపర్‌కి ఫోన్ చేయగా, అటువైపు నుంచి స్పందన రాలేదని, దీంతో తానే శుభ్రం చేసినట్లు వివరించారు. 'నాకు ఇలాంటి పనులు కొత్తేం కాదు. అవసరం అనుకున్నప్పుడు నేను ఈ పనులు చేశాను. నేను మంత్రి పదవిలో ఉన్నప్పటికీ.. ఇతరుల కంటే ఎక్కువని అనుకోవట్లేదు' అని ఆయన చెప్పారు. మంత్రితో పాటు ఆయన భార్య, కుమారుడు కూడా అదే ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: 'బాహుబలి' స్ఫూర్తిలో విల్లు, బాణాల తయారీ