ఇటీవల ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో జరిగిన జల ప్రళయంలో గల్లంతయ్యారనుకొన్న ఒక బృందం మూడు రోజులు మృత్యువుతో పోరాడి బయట పడింది. స్థానికంగా ఉండే రైనీ గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద తలదాచుకున్నవారు.. నిద్రాహారాలు లేక ప్రాణభయంతో కొట్టుమిట్టాడారు. తాము బతికి ఉన్న విషయం కుటుంబ సభ్యులకు చెప్పాలంటే.. ఫోన్‌కు సిగ్నల్ కూడా లేకుండాపోయింది.
మూడు రోజులు నరకం..
మంచు చరియలు విరిగిపడి, ఆకస్మిక వరద పోటెత్తడం కారణంగా అనేక మంది ఆచూకీ గల్లంతైంది. సరిహద్దు ప్రాంతాల్లో కూలి పని చేసి బతుకుదామని వచ్చిన వారికి విపత్తు శాపంగా మారింది. ఈ వరద ప్రభావంతోనే.. మూడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని బాధితులు తెలిపారు. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
"ఓ సంస్థకు చెందిన మొబైల్ టవర్‌ను నిర్మించడానికి మేం ఓ మారుమూల గ్రామంలోకి వెళ్లాం. అప్పుడే మాకు వరదల గురించి తెలిసింది. మేం ఉన్న ప్రాంతం నుంచి గ్రామం కూడా చాలా దూరంగా ఉంది. అక్కడి వారిని సంప్రదించడానికి కష్టం అయ్యింది. చివరికి ఎలాగోలా చేరుకున్నాం."
-సన్నీదత్, బాధితుడు
ఆచూకీ తెలియక.. పోలీసులకు ఫిర్యాదు
బాధితుల సమాచారం తెలియకపోవడంతో వరదల్లో కొట్టుకుపోయారు అని భావించారు వారి కుటుంబసభ్యులు. పోలీసులను ఆశ్రయించి.. కనిపించలేదని ఫిర్యాదు చేశారు. ఈలోగా బాధితులు రైనీ గ్రామంలో ఉండే అధికారులతో మాట్లాడి.. వారి వివరాలు తెలియపరిచారు. ఐటీబీపీ సిబ్బంది, అధికారుల చొరవతో కుటుంబసభ్యులతో మాట్లాడారు. క్షేమ సమాచారం తెలియజేశారు. వరదలతో కొట్టుకుపోయిన బ్రిడ్జ్‌లను యుద్ధప్రాతిపదికన నిర్మించగా.. జోషీమఠ్ కలెక్టర్ కుమ్కుమ్ జోషీ ఆదేశాల మేరకు వారికి భోజనం, ఇంటికి చేరుకునేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు.
"మా ఫోన్లు కలవలేదు. మేం తప్పిపోయాం అనుకొని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయినట్లుగా ప్రకటించారు. తరువాత మేం తిరిగి ఫోన్ చేసిన తరువాత వారి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది."
-కామీందర్, బాధితుడు
ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు, నదీ ప్రవాహం సృష్టించిన విలయంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు నాలుగో రోజు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 32 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా 174 మంది ఆచూకీ తెలియలేదు.