Miss World 2023 India : 27 సంవత్సరాల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ 2023 పోటీలను భారత్‌లో నిర్వహించనున్నామని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జులియా మోర్లీ తెలిపారు. ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కాతో మీడియా సమావేశంలో పాల్గొన్న మోర్లీ ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోర్లీ.. మిస్ వరల్డ్ 2023 పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
''మిస్ వరల్డ్ ఫైనల్‌కు ఇండియాను వేదికగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. 30 ఏళ్ల క్రితం నేను ఇండియాలో పర్యటించినప్పటి నుంచి ఆ దేశంపై నాకు ఆప్యాయత ఉంది. ప్రత్యేకమైన, వైవిధ్యమైన సంస్కృతి, ప్రపంచ స్థాయి ఆకర్షణలు, మంత్రముగ్ధుల్ని చేసే ప్రదేశాలను మీతో పంచుకోవాలని ఉంది. మిస్ వరల్డ్ లిమిటెడ్, పీఎమ్‌ఈ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ మిస్ వరల్డ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి భాగస్వామ్యమవుతున్నాయి. ఈ 71వ మిస్ వరల్డ్ ఎడిషన్‌లో 130 దేశాల ఛాంపియన్స్.. ఇంక్రెడిబుల్ ఇండియాలో నెల రోజుల పాటు సాగే ప్రయాణంలో వారు పొందిన విజయాలను, అనుభవాలను పంచుకుంటారు.'' అని మోర్లీ చెప్పారు.
Miss World 2022 Winner Karolina Bielawska : ఈ సందర్భంగా మాట్లాడిన మిస్ వరల్డ్ 2022 కరొలినా బిలావ్స్కా.. 'ప్రపంచాన్ని సాదరంగా ఆహ్వానించడానికి, దయ, అందం, ప్రగతిశీల స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఇండియా సిద్ధమవుతోంది. మహిళా శక్తితో మార్పు తేవడం కోసం మాతో కలవండి' అని పిలుపునిచ్చారు.
ఈ విశ్వ సుందరి పోటీలు ఈ ఏడాది నవంబర్‌లో జరుగుతాయని అంచనా. ఈ బ్యూటీ ఈవెంట్ కార్యాచరణ ఇంకా ఖరారు కాలేదు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో 130 దేశాల నుంచి పోటీదారులు పాల్గొంటారు. వారి ప్రతిభ, తెలివితేటలు, వారు చేసిన చారిటీ సేవలను ప్రదర్శిస్తారు. ఇందులో పలు దశల్లో క్రీడలు, చారిటీ సేవలు లాంటి కఠినమైన పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తారు పోటీదారులు. ఆ తర్వాత పలు దశల్లో పోటీదారులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
Miss World Aishwarya Rai 1994 : చివరగా 1996లో భారత్ మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యం ఇచ్చింది. ఇండియా నుంచి మొదటిసారి రేయితా ఫారియా 1966లో మిస్ వరల్డ్ టైటిల్ గెలిచింది. అనంతరం 1994లో ఐశ్వర్యరాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తా మూఖే, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విశ్వ సుందరి కిరీటం ధరించారు.