రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి కుమారుడిపై అత్యాచారం ఆరోపణలు చేసిన ఓ యువతిపై దిల్లీలో నడిరోడ్డుపై నీలి రంగు సిరాతో(కెమికల్) దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. దిల్లీలోని కలిండీ కంజ్ రోడ్డుపై బాధితురాలు తన తల్లితో కలిసి వాకింగ్ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి నీలిరంగు ద్రవాన్ని ఆమెపై చల్లారు. ఘటన జరిగిన వెంటనే బాధితురాలిని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు.
బాధితురాలు గత నెలలో రాజస్థాన్ మంత్రి మహేష్ జోషీ కుమారుడు రోహిత్ జోషిపై అత్యాచారం ఆరోపణలు చేస్తూ దిల్లీలో ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకొంటానని ప్రమాణం చేసి.. జనవరి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ మధ్యలో పలుమార్లు అతడు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. నిందితుడు రోహిత్ తనకు ఫేస్‌బుక్‌లో గతేడాది పరిచయం అయ్యాడని వెల్లడించింది. అత్యాచారంతో పాటు కిడ్నాప్, బెదిరింపుల ఆరోపణలు కూడా చేసింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దిల్లీ పోలీసు బృందం నిందితుడిని అరెస్టు చేసేందుకు జైపుర్ కూడా వెళ్లింది. కానీ, ఆ సమయంలో రాజేష్ ఇంట్లో లేడు. ఆ తర్వాత దిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకొని శనివారం.. పోలీసు విచారణ బృందం ఎదుట హాజరయ్యాడు. ఈ ఆరోపణల ఆధారంగా మంత్రి మహేష్ జోషిపై చర్యలు తీసుకొనే అంశాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కొట్టిపారేశారు.
ఇదీ చూడండి: యువతి దారుణ హత్య.. మూడు ఇళ్లు దగ్ధం.. ఆ కారణంతోనే 20 మంది కలిసి!