Manipur Election: సైనిక బలగాల మోహరింపు, వాటి దుర్వినియోగం.. ఇవే మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకాంశాలు. నిజానికి ఈ ఒక్క రాష్ట్రంలోనే కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నింట్లోనూ ఎన్నికల్లో ఇవే ప్రధానాంశాలు. అందుకే భాజపా వ్యూహాత్మకంగా మణిపుర్ ఎన్నికల ప్రచార ప్రముఖుల్లో ఒకరుగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఎంచుకుంది. 'సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం' (ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాలన్న ప్రధాన డిమాండుపై ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ఎలాంటి ప్రస్తావన చేయలేదు.
చిన్న రాష్ట్రమైనా రెండు దశలు
మణిపుర్‌లో ఈ నెల 28, మార్చి 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 60 శాసనసభ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 20 లక్షల్లోపే. అయినా ఇక్కడ రెండు దశల్లో పోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించడానికి కారణం.. భద్రతతో ముడిపడిన అంశాలే. 15 ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై భాజపా 2017లో ఆధారపడింది. 2012లో ఆ పార్టీకి కేవలం 1.3% ఓట్లు వస్తే ఐదేళ్లలోనే అది 36.3 శాతానికి పెరగడంతో సీట్ల సంఖ్య సున్నా నుంచి 21కి చేరింది. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఉండడం మణిపుర్‌లో ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది. ఆ ఉత్సాహంతోనే ఈసారి మొత్తం అన్ని స్థానాల్లో సొంతంగా పోటీ చేస్తోంది. 30కి పైగా సీట్లు గెలుచుకోగలమని కమలనాథులు అంచనా వేస్తున్నారు.
మణిపుర్ జనాభాలో 41.3% హిందువులు ఉంటే క్రైస్తవులు 41.29% మంది. 60 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని లోయల జిల్లాల ప్రజలే ఎన్నుకుంటారు. వీరిలో హిందువుల ప్రాబల్యం ఉన్న మెయితీలు ఎక్కువ. మిగిలిన 20 సీట్లు.. నాగాలు, కుకీలకు బాగా పట్టున్నవి.
ఇదీ చూడండి: యూపీలో భాజపా 'సురక్ష' నినాదం గెలిపిస్తుందా?