kashmir terrorist attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్ శివార్లలోని పంతా చౌక్ జెవాన్ ప్రాంతంలో పోలీసుల బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
దాడి సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాల్ని రంగంలోకి దింపి, ఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన ముష్కరుల కోసం గాలిస్తున్నామని.. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాదసంస్థ ప్రకటించలేదని అధికారులు పేర్కొన్నారు.
పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ప్రధాని మోదీ సంతాపం..
ఈ దుర్ఘటనపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఉగ్రవాదికి సంబంధించిన వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని మంత్రి కార్యాలయం తెలిపింది.
ఖండించిన గవర్నర్..
పోలీసులపై ఉగ్రదాడిని ఖండించారు జమ్ముకశ్మీర్ లెఫ్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. మృతుల కుటుంబాలకు గవర్నర్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.