లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీలో పలు మార్పులు చేపట్టారు. తన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌లకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. వీరిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సునీల్ తత్కారేకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హరియాణ, పంజాబ్, మహిళా యూత్, లోక్‌సభ కో ఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎన్సీపీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్‌పర్సన్‌గా కూడా సుప్రియా సూలేకు బాధ్యతలు అప్పజెప్పారు. ప్రపుల్ పటేల్ ఇక నుంచి మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు తీసుకోనున్నారు. రాజ్యసభ ఎన్సీపీ ఎంపీలను పటేల్ కో ఆర్డినేట్ చేయనున్నారు. తనపై నమ్మకం ఉంచి ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించింనందుకు పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నేతలకు ఎంపీ సుప్రియా సూలే ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.
దిల్లీలో నిర్వహించిన పార్టీ 25వ వ్యవస్థాపక సభలో మాట్లాడిన శరద్ పవార్.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అరోపించారు. బీజేపీ.. మతోన్మాద ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. 'ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. భారతదేశ ప్రజలు మాకు సహకరిస్తారని నేను నమ్ముతున్నాను' అని అభిప్రాయపడ్డారు.
ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని.. గత నెలలో పవార్ ప్రకటించడం పార్టీలో తీవ్ర అలజడి రేపింది. అనంతరం ముఖ్యనేతలు పెద్దఎత్తున చర్చలు జరిపి అధ్యక్ష పదవిలో కొనసాగేలా పవార్‌ను ఒప్పించారు.
శరద్ పవార్‌కు బెదిరింపులు...
Sharad Pawar Death Threat : ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు ఆగంతుకుల నుంచి వచ్చిన బెదిరింపు సందేశం కలకలం రేపింది. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తన తండ్రి పవార్‌ను బెదిరిస్తూ గురువారం తనకు వాట్సాప్ సందేశం వచ్చినట్లు ఆయన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. నరేంద్ర దభోల్కర్ మాదిరిగానే పవార్‌ను కూడా చంపనున్నట్లు బెదిరించారని చెప్పారు. సుప్రియాసూలే పార్టీ కార్యకర్తలతో కలిసి ముంబయి పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బెదిరింపు సందేశాల స్క్రీన్షాట్లను కూడా సమర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన సుప్రియా సూలే.. ఈ విషయంలో మహారాష్ట్ర హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి త్వరితగతిన జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవార్ జాతీయస్థాయి నాయకుడని.. ఆయన భద్రత బాధ్యత కేంద్ర హోం శాఖదే అని అన్నారు. ఇలాంటి బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రియా సూలే డిమాండ్ చేశారు. శరద్ వార్‌కు వచ్చిన బెదిరింపు సందేశంపై కేసు నమోదు చేసి.. ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సౌత్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. ఈ పుర్తి కథనాన్ని చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.