త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మేఘాలయ, నాగాలాండ్‌లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది భాజపా. ఈ రెండు ఈనాన్య రాష్ట్రాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయనుందో అనే అంశంపై కూడా స్పష్టతనిచ్చింది కమలం పార్టీ. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణ తురా నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు, మాజీ తీవ్రవాద నేత బెర్నార్డ్ మారక్‌ను బరిలోకి దింపనున్నట్లు తెలిపింది.
మేఘాలయ భాజపా ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మారక్.. మాజీ తీవ్రవాద నాయకుడు. మారక్ రాష్ట్రంలో 'గారో' గిరిజనుల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అచిక్ నేషనల్ వాలంటీర్ కౌన్సిల్(ఏఎన్వీసీ) అనే తీవ్రవాద సంస్థలో చేరారు. అనంతరం ఏఎన్వీసీ సంస్థను రద్దు చేసుకొని 2014లో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మారక్ ఈ సారి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాపై బరిలోకి దింగనుండడం వల్ల ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది.
మేఘాలయలో 60.. నాగాలాండ్‌లో 20..
మేఘాలయలో ఉన్న మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ స్థానాలకుగానూ 20 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఈశాన్య రాష్ట్రాల భాజపా ఇన్ఛార్జ్ రితురాజ్ స్పష్టం చేశారు. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)తో ఈసారి పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని రితురాజ్ తెలిపారు. ప్రస్తుతం సంగ్మా సంకీర్ణ ప్రభుత్వంలో భాజపా భాగస్వామి. మరోవైపు.. నాగాలాండ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(ఎన్డీపీపీ)తో పొత్తు కొనసాగుతుందని రితురాజ్ నిన్హా పేర్కొన్నారు. ఈ సారి శాసనసభ ఎన్నికల్లో 60స్థానాలకుగానూ 20 సీట్లలో పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 2018లో ఏర్పడిన నెఫ్యూ రియో ప్రభుత్వంలో భాజపా భాగస్వామి.
మేఘాలయ, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 2న ఫలితాలు వెలువడనున్నయి.