దేశ రాజకీయాల్లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఎనిమిది విపక్ష పార్టీలకు చెందిన నాయకులు సమావేశమై సమాలోచనలు జరిపారు. రాష్ట్ర మంచ్ అధ్యక్షుడు యశ్వంత్‌సిన్హా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాన రాజకీయ పార్టీలు, వాటి నేతలు పాల్గొనకపోయినా.. మున్ముందు భాజపా వ్యతిరేక కూటమి కట్టేందుకు భావ సారూప్య పార్టీలను నెమ్మదిగా ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయింది.
విపక్షాల కూటమి..
తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, సమాజ్‌వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, సీపీఐ, సీపీఎం నేతలు ఇందులో పాల్గొన్నారు. గేయ రచయిత జావేద్ అఖ్తర్, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా, మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ కూడా పాలుపంచుకున్నారు. శరద్ పవార్ (ఎన్సీపీ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), జయంత్‌సిన్హా (ఆర్‌ఎల్‌డీ) తప్పితే మిగిలిన అన్ని రాజకీయ పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నేతలే హాజరయ్యారు. కాంగ్రెస్, శివసేన, ఆర్‌జేడీ, బీజేడీ, డీఎంకె, తెరాస, తెదేపా, వైకాపా, జేడీఎస్, బీఎస్పీ, అకాలీదళ్, జేఎంఎం నేతలెవ్వరూ పాల్గొనలేదు. దీన్నిబట్టి ఇది పూర్తిస్థాయి రాజకీయ మేధోమథనం కాదని తెలుస్తోంది. వామపక్షాల నుంచి అగ్రనేతలు సీతారాం ఏచూరి, డి.రాజా పాల్గొంటారని ప్రచారం జరిగినా వారు తమ పార్టీల ప్రతినిధులను మాత్రమే పంపారు.
కాంగ్రెస్‌కు అందని ఆహ్వానం..
కాంగ్రెస్‌కు రాష్ట్ర మంచ్ నుంచి ఆహ్వానం వెళ్లలేదని సమాచారం. ఒకవేళ పిలిచినా ఈ భేటీకి వెళ్లడం ద్వారా విపక్షంలో తమది రెండో స్థానమేనని పరోక్షంగా అంగీకరించినట్లవుతుందని కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ మంగళవారం రాత్రి శరద్‌పవార్‌ను విడిగా కలిశారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవార్‌ను పరామర్శించడానికే ఆయన వచ్చారని మరాఠా నేత సన్నిహితులు చెబుతున్నారు.
ఇదీ చదవండి : మిషన్ 2024: పవార్, సిన్హా భేటీపై ఉత్కంఠ?
కలిసొచ్చే పార్టీలను ఏకం చేయాలనే ఉద్దేశం
భావ సారూప్య ఆలోచనలు, ప్రజా సమస్యలపై పోరాటాల ఆధారంగా కలిసివచ్చే పార్టీలను ఏకం చేయాలన్న ఉద్దేశంతో తాజా సమావేశానికి బీజం వేశారని ప్రచారం జరుగుతోంది. ఆలోచనలు కలిసిన తర్వాత భవిష్యత్తులో మోదీని ఎదుర్కొనే నేతను ఏకగ్రీవంగా ఎన్నుకొని 2024 ఎన్నికలకు వెళ్లాలనేది వీరి ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. పార్టీలను నిదానంగా ఏకాభిప్రాయం దిశగా నడిపించేందుకు ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయని నేతలు అంటున్నారు.
ఇదీ చదవండి : పవార్‌తో పీకే రెండోసారి- సరికొత్త రాజకీయాలకు ఆరంభమా?
ఫలితం వస్తుందా?
ఈ సమావేశం నుంచి ఏదైనా ఫలితం వస్తుందా? అన్న ఆశలు విభిన్న వర్గాల నుంచి వెలువడినా చివరకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలు లేకుండానే సమావేశం ముగిసింది. నిర్దిష్టమైన రాజకీయ ఎజెండాతో తాము కలవలేదని ఇందులో పాల్గొన్నవారు పేర్కొన్నారు. విభిన్న పార్టీల రాజకీయ నేతలతోపాటు, స్వేచ్ఛాయుత ఆలోచనలు వ్యక్తం చేసే మేధావులు, భాజపాను వ్యతిరేకించేవారు పాల్గొన్నారు. కేవలం దేశ రాజకీయ వాతావరణాన్ని తెలుసుకోవడానికి, ఆలోచనలను పంచుకోవడానికి కలిసినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ లేకుండా కేవలం మూడో ఫ్రంట్ భాజపాను సవాల్ చేయడం సాధ్యం కాదన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య.
"ప్రజల ఇబ్బందుల గురించి మాట్లాడాం. పోరాటానికి ఏం చేయాలి అని సమాలోచనలు జరిపాం. 2024 ఎన్నికల గురించి చర్చే రాలేదు. దీన్ని రాజకీయ పార్టీల సమాలోచనల కోణంలో చూడొద్దు" అని సమావేశానంతరం సీపీఎం సీనియర్ నేత నీలోత్పల్ బసు చెప్పారు. "ఇకపై జాతీయ రాజకీయాల్లో శరద్ పవార్ ప్రధాన భూమిక పోషించబోతున్నారు కాబట్టే కాంగ్రెస్ దీన్ని బహిష్కరించిందని వస్తున్న వార్తలు అబద్ధం. భాజపా వ్యతిరేక పార్టీలను ఒక్కటిగా చేయడానికి పవార్ దీనిని ఏర్పాటు చేశారని చెప్పడంలోనూ నిజం లేదు" అని ఎన్‌సీపీ సీనియర్ నేత మాజీద్ మెమన్ చెప్పారు.
ఇదీ చదవండి : 'ఎన్నికల వల్లే ఈ స్థాయికి ఎదిగారా?'
ప్రతిపక్షాల భేటీ కాదు: సేన
రాష్ట్ర మంచ్ నాయకులతో పవార్ నిర్వహించినది ప్రతిపక్షాల భేటీగా తాను అనుకోవటం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. పవార్ అనుభవజ్ఞుడని, దేశంలోని వివిధ అంశాలపై చాలామంది ఆయనను సంప్రదిస్తుంటారని చెప్పారు. తొలుత పవార్ నివాసంలోనే ఆయన అధ్యక్షతన ఎన్సీపీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాలపై రెండు గంటల పాటు చర్చించారు. పార్టీ కీలక నేతలు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి : Sharad Pawar: పవార్ నివాసంలో ప్రతిపక్షాల కీలక భేటీ
రాజకీయాలు మాట్లాడే సమయం కాదు: రాహుల్
విపక్ష నేతల భేటీపై ప్రశ్నలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమాధానాలు దాటవేశారు. రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని వర్చువల్‌గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెప్పారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విలేకరులతో మాట్లాడుతూ తృతీయ కూటమితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 2024 ఎన్నికల్లో తృతీయ కూటమి, చతుర్థ కూటమి భాజపాను సవాల్ చేయగలవని తాను అనుకోవడం లేదని చెప్పారు.
ఇదీ చదవండి : 'ప్రతిపక్షాల భేటీలో థర్డ్ ఫ్రంట్‌పై చర్చించలే'