దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో తట్టు వ్యాధి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమస్యను నివారించడానికి 9 నెలల నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలందరికీ తట్టు టీకాలను అదనపు డోసుగా ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. ఇటీవల బిహార్, గుజరాత్, హరియాణా, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్రల్లో తట్టు కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.
బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పరిధిలోని ప్రాంతాలతో పాటు పలు మహారాష్ట్ర జిల్లాల్లో ఇటీవల తట్టు కేసుల సంఖ్య బాగా పెరిగింది. ముంబయిలో తాజాగా 13 కొత్త కేసులు నమోదైనట్లు బీఎంసీ వెల్లడించింది. భీవండికి చెందిన ఎనిమిది నెలల బాలుడు మంగళవారం సాయంత్రం చనిపోయినట్లు పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య 12కు చేరిందని తెలిపింది. బుధవారం 30 మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరారని, అందులో 22 మందిని డిశ్చార్జ్ చేశారని వివరించింది.
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సహా ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ.. కేసుల పెరుగుదలపై అప్రమత్తం చేసింది. ఆయా భౌగోళిక ప్రాంతాల్లో ఇన్‌ఫెక్షన్ సోకిన పిల్లలంతా వ్యాక్సిన్ తీసుకోనివారేనని పేర్కొంది. కేసులు వస్తున్న ప్రాంతాల్లో.. ఎంఆర్సీవీ వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలిపింది. కాబట్టి 9 నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు అదనపు డోసుగా తట్టు టీకాను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి పి.అశోక్ బాబు.. రాష్ట్రాలను కోరారు. సాధారణంగా తట్టు, పొంగు టీకాలను 9 నుంచి 12 నెలల వయసులో మొదటి డోసు, 16 నుంచి 24 నెలల్లోపు రెండో డోసుగా ఇస్తారు. ఇప్పుడు ఐదేళ్లలోపు వారికి అదనపు డోసుగా ఇవ్వాలని కేంద్రం సూచించింది.