China Arunachal Pradesh names: అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడాన్ని కేంద్రం మరోమారు తీవ్రంగా తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్.. భారత్‌లో విడదీయలేని అంతర్భాగమని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాలు తమవే అని చైనా చేస్తున్న వాదనను ఆమోదించేది లేదని తేల్చి చెప్పింది.
China Bridge Pangong Tso
ప్యాంగాంగ్ సరస్సుకు ఆవల చైనా నిర్మిస్తున్న వంతెనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఆ ప్రాంతం 60 ఏళ్లుగా చైనా దురాక్రమణలో ఉందన్నారు.
"అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భగామేనని మరోసారి మీకు (చైనా) గుర్తు చేస్తున్నా. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న వంతెనకు సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. దాదాపు 60 ఏళ్లుగా చైనా దురాక్రమణలో ఉన్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. భారత్ ఈ నిర్మాణాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని చైనా గమనించాలి."
-అరిందమ్ బాగ్చి, విదేశాంగశాఖ ప్రతినిధి
అటు, ప్రవాస టిబెటన్ పార్లమెంటు విందుకు హాజరైన భారత ఎంపీలకు చైనా రాయబార కార్యాలయం లేఖ రాయడాన్ని ఆయన ఖండించారు. చైనా తన దృష్టిని ఎంపీలపై కాకుండా ఇరుదేశాల సంబంధాలపై పెట్టాలని హితవు పలికారు. 'ప్రజా ప్రతినిధులుగా భారతీయ ఎంపీలు తమ నమ్మకాలకు అనుగుణంగా కార్యకలాపాలు చేపడతారు. భారత ఎంపీల వ్యక్తిగత కార్యకలాపాలపై దృష్టి సారించటం మాని, ద్వైపాక్షిక సంబంధాలు మరింత క్లిష్టతరం కాకుండా చూస్తారని ఆశిస్తున్నాం' అని పేర్కొన్నారు.
మరోవైపు, గత ఏడేళ్లలో ప్రభుత్వం సరిహద్దులో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేసిందని బాగ్చి చెప్పారు. బడ్జెట్ను గణనీయంగా పెంచిందని తెలిపారు. స్థానికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. సైనిక అవసరాలకూ ఇవి ఉపయోగపడుతున్నాయన్నారు.
ఇదీ చదవండి: 'నడిరోడ్డుపై మోదీ'.. కుట్ర ప్రకారమే జరిగిందా? రైతుల మాటేంటి?