Mayawati News: రాష్ట్రపతి పదవిపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవి కోసం భాజపా సహా ఏ పార్టీ తనకు ఆఫర్ చేసినా తీసుకోబోనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంపై సమీక్ష అనంతరం మాయావతి మాట్లాడారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పదవికి పోటీ ఊహాగానాలపై కూడా స్పందించారు. గతంలో పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం సైతం అత్యున్నత పదవిని తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.
"ఒకవేళ రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తే అక్కడితో మన పార్టీ అంతమైనట్లే. కాబట్టి అలాంటి పదవిని భాజపాగానీ, ఇతర ఏ ఇతర పార్టీ ఆఫర్ చేసినా తీసుకునేది లేదు" అని మాయవతి స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల్లో భాజపా, ఆరెస్సెస్ కలసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేశాయని మాయవతి అన్నారు.
"ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పడకపోతే బెహన్‌జీ (మాయావతి)ని రాష్ట్రపతిని చేస్తామని వారు ప్రచారం చేశారు. దీంతో వారికి ప్రజలు అధికారం కట్టబెట్టారు" అంటూ పార్టీ ఓటమిపై సమీక్షలో మాయవతి పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవి అనేది తన కలలో కూడా లేని అంశమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని చెప్పారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. దీంతో ఆలోపే రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌ను ఒకప్పుడు ఏలిన బీఎస్పీ.. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఘోర పరాభవాన్ని చవిచూసింది. 403 స్థానాలకు గానూ పోటీ చేసి, కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది.
ఇదీ చూడండి: షాకింగ్ వీడియో.. అప్పటివరకు విధులు నిర్వహిస్తూ అంతలోనే..