కొత్తకొత్త కొవిడ్ వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలో ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది చివరినాటికి బూస్టర్ డోసు అవసరమన్నారు. 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సమాచారం సెప్టెంబర్ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
"వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. అందువల్ల భవిష్యత్తులో వచ్చే అన్ని రకాల వేరియంట్లను ఎదుర్కొనేందుకు మనకు బూస్టర్ డోసు అవసరం. బూస్టర్ డోసు వల్ల సామర్థ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బూస్టర్ డోసుపై క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి మనం బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయినప్పుడే అది సాధ్యం."
-డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
సెప్టెంబర్‌లో ఫలితాలు..
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా.. పిల్లలకు ఇవ్వటంపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని గులేరియా తెలిపారు. సెప్టెంబర్ నాటికి ఫలితాలు వెలువడతాయన్నారు.
"పిల్లలకు కొవిడ్-19 వ్యాక్సిన్లు రానున్నాయి. ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. భారత్ బయోటెక్ పరీక్షలు తుదిదశలో ఉన్నాయి. జైడస్ క్యాడిలా తయారు చేసిన టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయ్యాయి. టీకా వినియోగ అనుమతి కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది."
-డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
ఫైజర్, మోడెర్నా టీకాలను భారత్‌లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం.. ఆయా కంపెనీలతో చర్చలు జరుపుతోందన్నారు. ఇతర దేశాలు ఈ టీకాలను బుకింగ్ చేసుకున్నందువల్ల.. వ్యాక్సిన్ డోసుల లభ్యతకు సమయం పట్టొచ్చని వివరించారు.
ఇవీ చదవండి: