ఒకే రోజు 3,229 పెళ్లిళ్లు చేసి ఛత్తీస్‌గఢ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. హిందూ, ముస్లిం, క్రిష్టియన్ అనే తేడా లేకుండా అన్నీ జంటలు ఏకకాలంలో ఒక్కటయ్యాయి. ఈ బృహత్తర కార్యక్రమానికి రాయ్‌పుర్‌లోని ఇండోర్ స్టేడియం వేదిక అయింది. ఈ పెళ్లిల్లకు పెద్దగా ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ వేడుకకు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర శిశు సంక్షేమాభివృద్ధి శాఖ నిర్వహించింది.
'ముఖ్యమంత్రి కన్య వివాహ యోజనా' కింద జరిగిన ఈ వేడుక 'గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్'ల్లో స్థానం సంపాదించినట్లు ఆ సంస్థ ప్రతినిధి సోనాల్ రాజేశ్ శర్మ ప్రకటించారు. దీనిలో మొత్తం 22 జిల్లాల నుంచి వర్చువల్ విధానం ద్వారా వధూవరులు హజరయ్యారు.
"మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారాలి. సామూహిక వివాహాలకు ఆదరణ పెరగాలి. ప్రజలు కూడా ఇటువంటి వాటికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇదో శుభ పరిణామం. నాకు ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెళ్లైన కొత్త జంటలకు రూ.15 వేలు ఇచ్చేవారు. మా ప్రభుత్వం రూ. 25వేలు ఇస్తోంది."
- భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి