March High temperatures: ఎన్నో 'మార్చి'లొచ్చాయి గానీ.. చూడలేదింతటి మండే ఎండలంటోంది భారత వాతావరణ విభాగం(ఐఎండీ). ఈ ఏడాది మార్చి నెల దాదాపు అగ్నిగుండాన్ని తలపించిందంటోంది. గత 122 ఏళ్లలో ఏ మార్చి నెలలోనూ నమోదవ్వని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది రికార్డయ్యాయని శనివారం పేర్కొంది. "దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చిలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 33.10 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 122 ఏళ్లలో ఇదే అత్యధికం" అని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంత అసాధారణ వేడికి వర్షపాతం తగ్గిపోవడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
lowest rainfall: సాధారణంగా మార్చి నెల దేశవ్యాప్త వర్షపాత సుదీర్ఘ సగటు 30.4 మిల్లీమీటర్లు. ఈసారి అది కేవలం 8.9 మిల్లీమీటర్లకే పరిమితమైంది. దాదాపు 71 శాతం తక్కువ. 1908 తర్వాత ఇదే అత్యల్ప వర్షపాతం కూడా. వాయువ్య భారతదేశంలో 89 శాతం తక్కువగా వర్షపాతం నమోదైందని ఐఎండీ ప్రకటించింది. సాధారంగా కురిసే వర్షపాతం 47.5 మిల్లీ మీటర్లు కాగా.. మార్చి నెలలో 5.2 మిల్లీ మీటర్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో వేడి గాలులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. జమ్ము, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్, రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా రానున్న రెండు నుంచి నాలుగు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని స్పష్టం చేసింది. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఏప్రిల్ 2 నుంచి 4 మధ్య భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది.
ఇదీ చదవండి: మానవత్వం నిలిపిన ప్రాణం.. పసిగుండెను కాపాడేందుకు తరలిన జనం!