Jharkhand Maoist attack : ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీకి ఓ చిన్నారి బలయ్యాడు. ఒక్కసారిగా ఐఈడీ పేలడం వల్ల పదేళ్ల బాలుడు మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. రెంగ్రాహటు ప్రాంతంలోని బంగ్లాసాయ్ టోలాకు చెందిన బాలుడు.. కెండు ఆకుల కోసం రోలాబ్రుపీ జెంగగాద అడవుల్లోకి వెళ్లాడని పోలీసులు వివరించారు. బాలుడు తనకు తెలియకుండానే ఐఈడీపై కాలు వేయడం వల్ల అది పేలిపోయిందని చెప్పారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగిందని జిల్లా ఎస్పీ అశుతోశ్ శేఖర్ వెల్లడించారు.
Jharkhand maoist news : ఐఈడీని పోలీసులను లక్ష్యంగా చేసుకొనే మావోయిస్టులు పాతిపెట్టారని పేర్కొన్నారు. 'ఈ ఘటన మావోయిస్తుల పిరికిపంద చర్య. తీవ్రమైన నిరాశతో ఇలా చేశారు. ఏదేమైనా మావోయిస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్ ఆగదు' అని స్పష్టం చేశారు. 'సమాచారం అందిన వెంటనే పోలీసులు, కేంద్ర సాయుధ దళాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. స్థానికుల సహాయంతో బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. శవాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం చాయ్‌బాసాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాం' అని ఎస్పీ వివరించారు.
మావోయిస్టులు పాతిపెట్టిన ఐఈడీలు పేలడం వల్ల ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు వృద్ధ మహిళలు సైతం ఉన్నారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు ఈ ఐఈడీలు పాతిపెడుతున్నారు. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో పాల్గొంటున్న పోలీసులు, సీఆర్పీఎఫ్, కోబ్రా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఝార్ఖండ్‌లో జనవరి నుంచి మావోయిస్టుల వేటను ముమ్మరం చేశారు. మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా.. జిల్లాలోనే ఉన్నాడనే సమాచారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మిసిర్ బెస్రా తలపై రూ.కోటి రివార్డు ఉంది.
IED దాడిలో 11 మంది మృతి
ఇటీవలె ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జరిపిన ఐఈడీ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది పోలీసులు కాగా ఒకరు డ్రైవర్. దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో డిస్ట్రిక్ రిజర్వ్‌గార్డ్( DRG) పోలీసులు.. ప్రత్యేక యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా.. అరణ్పుర్ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీతో వాహనాన్ని పేల్చేశారు. దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి : బాలుడి శ్వాసనాళంలో విజిల్.. ఊపిరి వదిలితే సౌండ్.. క్లిష్టమైన ఆపరేషన్ చేసి..
బస్సులో హస్తప్రయోగం.. మహిళతో యువకుడి అసభ్య ప్రవర్తన.. బీజేపీ కౌన్సిలర్‌కు వేధింపులు