బిహార్‌లోని బాంకా జిల్లాలో ఓ వివాహ వేడుకలో భోజనం చేసిన 250 మంది అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు.. గ్రామానికి చేరుకున్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
చందన్ బ్లాక్‌లోని కస్వావాసి పంచాయతీలో ఛీడా గ్రామానికి చెందిన బాబర్ అన్సారీ ఇంట వివాహ వేడుక జరిగింది. గ్రామస్థులంతా భోజనానికి వెళ్లారు. అందరూ చికెన్ రైస్ ఆరగించారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. చాలా మందికి చిన్నపాటి కడుపు నొప్పి వచ్చింది. మెడికల్ షాప్‌లో మందులు కొనుక్కొని వేసుకున్నారు. ఆ తర్వాత అనేక మంది ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. 250 మందికి పైగా గ్రామస్థులు.. వాంతులు, విరోచనాలు అవ్వడం వల్ల నీరసించిపోయారు.
ఈ విషయం స్థానిక అధికార యంత్రాంగానికి చేరింది. వెంటనే వైద్యారోగ్య శాఖ బృందం గ్రామానికి చేరుకుంది. హుటాహుటిన గ్రామంలోనే వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తోంది. డయేరియా సోకిన రోగులు కోలుకునే వరకు గ్రామంలో వైద్య శిబిరం ఉంటుందని ఎస్‌డీపీఓ ప్రేమ్‌చంద్‌సింగ్ తెలిపారు. బాధితులకు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ అందిస్తున్నట్లు చెప్పారు తెలిపారు. ఫుడ్ పాయిజన్ కావడం వల్లే వివాహానికి వెళ్లిన వారంతా అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. కొందరి పరిస్థితి విషమంగా మారిందని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు.
ఇలాంటిదే మరో ఘటన.. గతనెల బిహార్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఆ భోజనం తిన్న చిన్నారుల్లో దాదాపు 25 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటన నుంచి చిన్నారులు అందరూ ఆరోగ్యంగా బయటపడ్డారు. ఈ ఘటన అరారియా జిల్లాలో జరిగింది. అయితే ఆరోజు మధ్యాహ్న భోజనం పాఠశాలలో వండింది కాదని.. ఓ కాంట్రాక్టర్ సరఫరా చేశారని సిబ్బంది తెలిపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫర్బిస్గంజ్ సబ్‌డివిజన్ పరిధిలోని జోగ్‌బానిలోని సెకండరీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన చిన్నారుల్లో చాలా మంది వాంతులు చేసుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం అస్వస్థతకు గురైన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు సైతం హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. స్కూల్ వద్ద కాసేపు ఆందోళన చేపట్టారు. ఘటనపై హైలెవల్ కమిటీతో విచారణ జరిపిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఈ కథనాన్ని పూర్తిగా చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.