ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పోలీసు అధికారి సచిన్ వాజేతో కలిసి గతంలో ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న ఓ కానిస్టేబుల్‌ను, ఒక బుకీని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) తాజాగా అరెస్టు చేసింది. కారు యజమానిగా భావిస్తున్న మాన్సుఖ్ హిరెన్ హత్య కేసుతో వీరిద్దరికి సంబంధం ఉన్నట్లు ఆరోపించింది. కాగా ఈ కేసులో కీలక పాత్ర సచిన్ వాజేనే పోషించాడని, అతడే ప్రధాన నిందితుడని తెలిపింది.
ఇప్పటికే మాన్సుఖ్ హిరెన్ మృతి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు కేంద్ర హోంశాఖ అప్పగించింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసును విచారించిన ఏటీఎస్ దర్యాప్తు వివరాలను ఎన్‌ఐఏకు అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సస్పెన్షన్‌లో ఉన్న ముంబయి పోలీస్ కానిస్టేబుల్ వినాయక్ షిండే (55), బుకీ నరేష్ ధార్‌ను ఏటీఎస్ బృందం అదుపులోకి తీసుకుంది. వీరిలో వినాయక్ షిండే ముంబయి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ బృందంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. అదే బృందంలో సచిన్ వాజే కూడా పనిచేశారు.
2006లో ఛోటా రాజన్ అనుచరుడు లఖన్ భయ్యా(రామ్‌నారాయణ్ గుప్తా) ఎన్‌కౌంటర్ కేసులో వినాయక్ సస్పెండ్ అయ్యాడు. 2013లో సెషన్స్ కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. ప్రస్తుతం పెరోల్‌పై బయట ఉన్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఏటీఎస్ డీఐజీ శివదీప్ లాండే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మాన్సుఖ్ మృతి కేసు కథ ముగిసిపోయిందని ఆయన అన్నారు.
ఇవీ చూడండి: