Manish Sisodia CBI: నూతన మద్యం విధానం కేసులో శనివారం దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా సీబీఐ ముందు హాజరయ్యారు. సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం వరుస ట్వీట్లు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా.. భాజపా ప్లాన్‌లో భాగంగా తనను నకిలీ కేసులో అరెస్టు చేయనున్నారని ఆరోపించారు.
"రానున్న రోజుల్లో నేను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. నన్ను ఆపడమే వారి ఉద్దేశం. ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. భాజపా ప్లాన్‌లో భాగంగా నన్ను నకిలీ కేసులో అరెస్టు చేయనున్నారు. నేను గుజరాత్ వెళ్లినప్పుడు.. దిల్లీ లాంటి అద్భుతమైన పాఠశాలలు నిర్మిస్తామని అక్కడి ప్రజలకు చెప్పాను. కానీ ఇది కొందరికి నచ్చడం లేదు. అయితే నేను జైలుకు వెళ్లడం వల్ల ఈ ఎన్నికల ప్రచారం ఆగదు. రానున్న రోజుల్లో ఆ ఎన్నికలు ఉద్యమంలా మారనున్నాయి" అంటూ భాజపాపై విమర్శలను గుప్పించారు.
అయితే సోమవారం ఉదయం.. తన ఇంటి నుంచి సీబీఐ కేంద్ర కార్యాలయానికి బయలుదేరేముందు తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత తన వెంట వచ్చిన పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. "ఇంతకుముందు వారు నా ఇంటిపై సోదాలు నిర్వహించారు. కానీ ఏమీ దొరకలేదు. ఈ రోజు కూడా వారికి ఏమీ దొరకదు. నన్ను జైల్లో పెట్టి భాజపా ఎన్నికల్లో విజయం సాధించలేదు" అంటూ వ్యాఖ్యలు చేశారు.
సిసోదియాకు ఆదివారం.. సీబీఐ సమన్లు జారీచేసిన వ్యవహారంపై దిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఉప ముఖ్యమంత్రి సిసోదియా, ప్రస్తుతం జైల్లో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్.. నేటి తరం భగత్‌సింగ్‌లు అంటూ కొనియాడారు. కేంద్రంతో తమ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర సంగ్రామంగా అభివర్ణించారు.
ఇవీ చదవండి: ఖర్గే X థరూర్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్.. ఓటేసిన కీలక నేతలు
భాజపా X ఆప్ X కాంగ్రెస్.. గుజరాత్ బరిలో 'త్రిముఖ' వ్యూహాలు