Manipur Elections 2022: మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. 'సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం' అంశాన్ని రాజకీయ పార్టీలు మరోసారి తెరమీదకు తెచ్చాయి. ఈ చట్టం ఉపసంహరణకు, మానవహక్కుల పరిరక్షణకు ఉద్యమించిన ఇరోం షర్మిల మణిపుర్‌లో దాదాపు 16 ఏళ్ల పాటు నిరాహారదీక్ష కూడా చేపట్టింది. పొరుగున ఉన్న నాగాలాండ్‌లో ఇటీవల తీవ్రవాదులుగా పొరబడి సామాన్యులను సైనికులు హతమార్చడంతో ఈ చట్టంపై నిరసనలు మరోసారి మిన్నంటాయి. దీన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుత ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అధికార భాజపా ఈ చట్టం ఉపసంహరణపై తన మేనిఫెస్టోలో ఎలాంటి ప్రస్తావన చేయకపోవడాన్ని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతోంది. తమను గెలిపిస్తే ఈ చట్టాన్ని ఉపసంహరిస్తామని చెబుతోంది.
మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలైన నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్‌లు కూడా ఈ చట్టం ఉపసంహరణకు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో ఈ చట్టంపై భాజపా మౌనం వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తన పర్యటనలో ప్రధాని మోదీ అత్యంత కీలకమైన ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించడం గమనార్హం. మణిపుర్‌లో కాంగ్రెస్ కురువృద్ధుడు, ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఒక్రమ్ ఇబొబి తన ప్రచారంలోనూ ఈ చట్టంపై భాజపా మౌనాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో ఈ ప్రచారాన్ని అడ్డుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల సమయంలో తాము హామీ ఇచ్చినట్లు సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టానికి విలువ లేకుండా చేశామని, గత అయిదేళ్లలో రాష్ట్రంలో ఒక్క బూటకపు ఎన్‌కౌంటర్ జరగలేదని రాష్ట్ర భాజపా అధికారి ప్రతినిధి బసంత చెప్పారు. దీంతో మేనిఫెస్టోలో ఆ చట్టాన్ని ప్రస్తావించాల్సిన అవసరం రాలేదన్నారు. ఈశాన్య భారతంలో ఈ చట్టాన్ని ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని, అవసరమైతే మణిపుర్‌లో ఉపసంహరణకు తాము సిద్ధమేని చెబుతున్నారు.
పరిహారంపై చర్యలేవి?
గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్లను గత ఎన్నికల సమయంలో భాజపా ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. అధికారంలోకి వచ్చాక బాధితులకు పరిహారం చెల్లించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని 'హ్యూమన్ రైట్స్ అలెర్ట్' స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బబ్లూ లొయితొంగ్‌బం నిరసన వ్యక్తం చేశారు. బబ్లూ 'ఈనాడు'తో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే కొత్త ప్రభుత్వమైనా ఇందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్యాయంగా 1528 మందిని హతమార్చారంటూ తాము దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నట్లు చెప్పారు. బాధితులకు న్యాయం చేయకుండా మానవ హక్కుల అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇంతవరకు రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఈ చట్టం ప్రచారాంశం కాలేదని, పార్టీల ప్రకటనలు కంటితుడుపు చర్యలేనని పలువురు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి: అయోధ్యలో ఆధిపత్యం ఎవరిదో.. కమలం హవా కొనసాగేనా?