ఓ పండ్ల వ్యాపారి వినూత్నంగా ఆలోచించారు. మామిడి పండ్లు కొనేందుకు ఈఎమ్‌ఐ ఆఫర్ ప్రకటించారు. అవసరమైతే ఫైనాన్స్ కూడా చేస్తానంటున్నారు. ఆయనే మహారాష్ట్ర పుణెకు చెందిన మామిడి పండ్ల వ్యాపారి గౌరవ్ సనాస్. గురుకృప ట్రేడర్స్ అండ్ ఫ్రూట్ ప్రొడక్ట్స్ పేరుతో.. పండ్ల వ్యాపారం చేస్తున్నారు. మామిడిపండ్ల ధరలు పెరిగిపోవడం వల్ల రోజురోజుకూ వాటిని కొనేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలోని దేవగఢ్, రత్నగిరి జిల్లాల్లో దొరికే ఆల్ఫోన్సో రకం మామిడి పండ్లు భారీ ధర పలుకుతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో వీటి ధర డజన్‌కు 8వందల నుంచి 13వందల వరకు ఉంటుంది. ఇది గమనించిన గౌరవ్.. ఏదైనా కొత్తగా ఆలోచించి వినియోగదారులను తన మామిడి పండ్ల వైపు ఆకర్షించాలని భావించారు. దీనికోసం ఓ కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
తన వద్ద ఒకసారి పండ్లను కొనుగోలు చేసి వాయిదా పద్ధతుల్లో చెల్లింపులు చేయవచ్చని వినియోగదారులకు గౌరవ్ బంపరాఫర్ ఇచ్చారు. ఇప్పుడు కొనుక్కుని.. ఈఎమ్‌ఐ రూపంలో డబ్బులు చెల్లించవచ్చని పేర్కొన్నారు. దీనికి కొన్ని షరతులు కూడా విధించారు. రూ.5వేల కంటే ఎక్కువ విలువ చేసే పండ్లను.. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ ఇస్తానని ప్రకటించారు. మామిడి పండ్లను కొనుగోలు చేసిన తర్వాత కార్డుతో స్వైప్ చేసి ఈఎమ్‌ఐ సౌకర్యం కల్పిస్తున్నారు. తర్వాత 3, 6, 12 నెలల వాయిదాల్లో చెల్లించొచ్చని చెప్పారు. అంతేకాదు భవిష్యత్‌లో ఫైనాన్స్‌లో కూడా మామిడిపండ్లను విక్రయిస్తానని గౌరవ్ పేర్కొన్నారు.
"లాక్‌డౌన్ సమయంలో నా వ్యాపారం సగానికి పడిపోయింది. వినియోగదారులు మామిడి పండ్ల నుంచి దూరమైపోతున్నారు. వారి గురించి ఆలోచించి వారికి ఏదైనా చేయాలని ఈ ఈఎమ్‌ఐ ఆఫర్‌ను ప్రారంభించాను. ఇప్పుడు కొత్త కొత్త ఫైనాన్స్ కంపెనీలు వచ్చాయి. అవి వడ్డీ తీసుకుని వినియోగదారులకు ఫైనాన్స్ ఇస్తాయి. భవిష్యత్‌లో అలా మామిడిపండ్లను విక్రయించాలని ఆలోచిస్తున్నాను. ప్రజలు మామిడి పండ్ల రుచిని మరిచిపోతున్నారు. వారికి దాన్ని గుర్తుచేయాలని భావిస్తున్నాను. గతంలో రూ.20 వేల ఫోన్ కొనాలంటే కష్టమయ్యేది. కానీ ఈఎమ్‌ఐతో లక్ష రూపాయల ఫోన్‌ను కూడా జనం వెంటనే కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మామిడిపండ్లను కూడా కొంటారు."
--గౌరవ్ సనాస్, మామిడిపండ్ల వ్యాపారి
మామిడి పండ్ల ధరలు పెరిగిపోతుండటం వల్ల.. చాలామంది వాటిని కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్నారని... అలాంటి వారిని మామిడిపండ్లకు దూరం చేయవద్దనే ఉద్దేశంతోనే ఈ విధానం తీసుకువచ్చినట్లు గౌరవ్ పేర్కొన్నారు. తన వద్ద రసాయనాలు వాడని.. స్వచ్ఛమైన మామాడిపండ్లు దొరుకుతాయని తెలిపారు.