Man Swallowed Tongue Cleaner In Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్.. గోండా జిల్లాలో విచిత్ర ఘటన జరిగింది. ఓ యువకుడు పళ్లు తోముకున్న తర్వాత.. ప్రమాదవశాత్తు స్టీల్ టంగ్ క్లీనర్ మింగాడు. దీంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. అనంతరం ఆ యువకుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. వెంటనే అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇదీ జరిగింది..
మోతీగంజ్ ప్రాంతంలోని కర్మాయిని గ్రామానికి చెందిన శివకాంత్ (25) రోజులాగే శుక్రవారం ఉదయం బ్రష్‌తో పళ్లను శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు టంగ్ క్లీనర్‌ను మింగేశాడు. అనంతరం అతడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. దీంతో పాటు ఛాతిలో కూడా నొప్పి మొదలైంది. సరిగా మాట్లాడటం కూడా రాలేదు. అతడి పరిస్థితి చూసి భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే, గొంతులో ఇరుక్కు పోయిన టంగ్ క్లీనర్‌ను ఎలా బయటకు తీసుకురావాలో ఆ వైద్యుడికి అర్థం కాలేదు. అనంతరం బాధితుడిని గోండాలోని ఆర్ఎన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ ఆర్ఎన్ పాండే బాధితుడి శివకాంత్ ఎక్స్-రే తీయించారు. రిపోర్ట్ చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అనంతరం యువకుడికి ఆపరేషన్ చేసి గొంతు లోపల ఇరుక్కుపోయిన నాలుక క్లీనర్‌ను బయటకు తీశారు. ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి శివకాంత్ ప్రాణాలను కాపాడినందుకు.. బాధితుడి కుటుంబ సభ్యులు డాక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై స్పందించిన డాక్టర్ ఆర్ఎన్ పాండే.. బాధితుడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతోందని తెలిపారు.
గొంతులో ఇరుక్కున్న దేవుడి విగ్రహం..!
మనం దేవుడ్ని భక్తిశ్రద్దలతో పూజ చేయడంలో తప్పు లేదు. కానీ ఆ ధ్యాసలో పడి ప్రపంచాన్నే మర్చిపోకూడదు. అలా చేసిన ఓ భక్తుడు.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. పూజ ధ్యాసలో మునిగిపోయి తీర్థంతోపాటు బాలకృష్ణుడి విగ్రహాన్ని మింగేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
మహిళ మెడలో గోల్డ్ చైన్ చోరీ.. తప్పించుకునేందుకు గొలుసు మింగేసిన దొంగ.. చివరకు..
'మేకు'ను మింగేసిన బాలుడు.. ఛాతిలో ఇరుక్కుని నరకం.. చివరకు...