పిల్లలే తమ భవిష్యత్‌గా భావించి.. వారి కోసం ఏం చేయడానికైనా తల్లిదండ్రులు వెనకాడరు. అలాంటి ఓ తండ్రి జోరున కురుస్తున్న వానలో చదువుకుంటున్న తన కుమార్తెకు గొడుగు పట్టాడు. కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఈ తండ్రీకూతుళ్ల ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తండ్రి చూపిన చొరవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
![father holds umbrella for daughter's studies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:18:16:1623912496_kn-dk-01-networkissue-brk-pho-kac10008_16062021231041_1606f_1623865241_559_1706newsroom_1623910217_945.jpg)
ఆన్లైన్ తరగతులకు రోజూ హాజరవుతున్న ఓ విద్యార్థినికి.. గ్రామంలో మొబైల్ సిగ్నల్స్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి.. రోడ్డు పక్కన కూర్చొని తరగతులకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలోనూ తరగతులకు హాజరవ్వాలనే ఆరాటంతో తండ్రిని వెంట తీసుకెళ్లింది. ఆ వర్షంలో కూతురు మొబైల్లో క్లాసులు వింటుండగా.. తండ్రి గొడుగు పట్టుకుని ఉన్నాడు. ఈ దృశ్యాన్ని క్లిక్‌మనిపించిన ఓ వ్యక్తి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.
అయితే నెట్వర్క్, సిగ్నల్స్ సమస్య ఆ ఒక్క విద్యార్థినిదే కాదు.. ఆ ప్రాంతంలోని అందరిది. ఈ విషయమైన ఇప్పటికే అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేయగా.. పరిష్కరిస్తామంటూ చెప్పడమే గానీ.. ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని సుళ్య, కడబా మండలాల్లో సిగ్నల్ సమస్య సర్వసాధారణం. దీనిపై మంత్రుల స్థాయిల్లో ఎన్నో సమావేశాలు జరిగాయని.. ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు చెబుతున్నారు అక్కడి ప్రజలు. అయినా ఫలితంలేదని వాపోతున్నారు.
ఇదీ చూడండి: సోనియా, రాహుల్ టీకా తీసుకున్నారా?